ఏప్రిల్ 1 నుండి ఆట మారుతుంది! పాన్ కార్డ్ నిబంధనల్లో భారీ మార్పులు; తెలుసుకోకపోతే ఇబ్బందే!

భారత ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తూ 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. దీనితో పాటు పాన్ కార్డ్ వాడకం, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో ఆదాయపు పన్ను శాఖ భారీ సంస్కరణలు చేపట్టింది. సాధారణ ప్రజలు తెలుసుకోవలసిన 6 ముఖ్యమైన మార్పులు ఇక్కడ ఉన్నాయి:

1. పాన్ దరఖాస్తు ఇకపై మరింత కఠినం: ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డుతోనే పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే ఏప్రిల్ 1 నుండి ఈ సౌకర్యం నిలిపివేయబడుతుంది. ఇకపై పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పుట్టిన సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్లలో ఏదో ఒకటి కచ్చితంగా సమర్పించాలి. అలాగే పాన్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ.. ఆధార్‌లోని వివరాలతో 100% సరిపోలాలి.

2. బ్యాంక్ లావాదేవీలు: రోజువారీ పరిమితి నుండి వార్షిక పరిమితికి: ప్రస్తుతం రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ అడుగుతున్నారు. కానీ కొత్త నిబంధన ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం నగదు డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ రూ. 10 లక్షలు దాటితే పాన్ వివరాలు ఇవ్వాలి. చిన్న మొత్తాల్లో పదేపదే లావాదేవీలు చేస్తూ పన్ను ఎగవేసే వారిని అడ్డుకోవడమే దీని లక్ష్యం.

3. వాహనాల కొనుగోలులో మార్పులు: గతంలో దాదాపు అన్ని వాహనాలకు (ద్విచక్ర వాహనాలు మినహా) పాన్ అవసరమయ్యేది. ఇకపై రూ. 5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలు కొన్నప్పుడు మాత్రమే పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇది బడ్జెట్ కార్లు, బైకులు కొనే సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.

4. ఆస్తి లావాదేవీల్లో వెసులుబాటు: రియల్ ఎస్టేట్ రంగంలో పాన్ కార్డు తప్పనిసరి పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచారు. అంటే రూ. 20 లక్షల లోపు ఆస్తి లావాదేవీలకు (కొనుగోలు, అమ్మకం, గిఫ్ట్) ఇకపై పాన్ వివరాలు అవసరం లేదు.

5. హోటల్ బిల్లులు మరియు వేడుకలు: హోటళ్లు లేదా రెస్టారెంట్లలో నగదు చెల్లింపుల పరిమితిని రూ. 50,000 నుండి రూ. 1 లక్షకు పెంచారు. కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవలకు కూడా ఇదే వర్తిస్తుంది. రూ. 1 లక్ష దాటినప్పుడు మాత్రమే పాన్ ఇవ్వాలి.

6. ఇన్సూరెన్స్ పాలసీలు: ఇన్సూరెన్స్ రంగంలో కఠినమైన మార్పు వచ్చింది. గతంలో రూ. 50,000 దాటితేనే పాన్ అడిగేవారు. కానీ ఇకపై ప్రీమియం ఎంతైనా సరే, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే పాన్ కార్డు తప్పనిసరి. పాలసీ తీసుకునే సమయంలోనే అది పాన్‌తో లింక్ అయి ఉండాలి.


Posted

in

by

Tags: