“తదుపరి లక్ష్యం క్యూబానే..” మళ్లీ ఆట మొదలుపెట్టిన అమెరికా.. బహిరంగంగా హెచ్చరించిన ట్రంప్!

వాషింగ్టన్: అమెరికా బలగాలు గతంలో వెనిజులాలో దిగి ఆ దేశ అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేశాయి. ఆ తర్వాత గత నాలుగు వారాలుగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతుండగా, ట్రంప్ మరో వివాదానికి తెరలేపారు. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “తదుపరి లక్ష్యం క్యూబానే” అని ప్రకటించడం కలకలం రేపుతోంది.

గత ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. గత ఏడాది అంతా ఆయన పన్నుల వ్యవహారం చర్చనీయాంశం కాగా, ఈ ఏడాది ఒక్కో దేశంతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు.

వెనిజులా మరియు ఇరాన్: గత జనవరిలో వెనిజులాలో ప్రవేశించిన అమెరికా సైన్యం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధం కొద్ది రోజుల్లోనే ముగుస్తుందని ట్రంప్ భావించినప్పటికీ, ఇరాన్ ఎదురుదాడి చేయడంతో నెల రోజులకు పైగా పోరు కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ భరిత పరిస్థితులు ఇలా ఉండగానే, ఆయన మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

క్యూబాపై కన్ను: మియామీలో జరిగిన ఒక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. వెనిజులా, ఇరాన్‌లలో అమెరికా సైన్యం విజయం సాధించిందని పేర్కొన్నారు. తదుపరి టార్గెట్ క్యూబా అని ఆయన స్పష్టం చేశారు. క్యూబాలోని హవానా ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా పతనం అంచున ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, క్యూబాపై తన ప్రణాళికలేంటో ఆయన పూర్తిగా వెల్లడించలేదు.

క్యూబా నాయకులతో ట్రంప్ యంత్రాంగం చర్చలు జరుపుతోందని, అవసరమైతే అక్కడ సైనిక చర్యకు కూడా అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయంగా గందరగోళ పరిస్థితులు ఉండగా, ఇప్పుడు మళ్లీ సైనిక చర్య అంటే అది మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రంప్ మాటల్లో.. “నేనే ఈ గొప్ప సైన్యాన్ని నిర్మించాను. ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యం మన దగ్గర ఉన్నప్పుడు, దానిని ఉపయోగించకుండానే మీరు గెలవవచ్చు. కానీ కొన్ని సమయాల్లో మీరు దానిని వాడాల్సి ఉంటుంది. మన తదుపరి లక్ష్యం క్యూబానే” అని ట్రంప్ అన్నారు.

ఆర్థిక సంక్షోభంలో క్యూబా: మరోవైపు, సైనిక ఘర్షణను నివారించడానికి అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు క్యూబా అధ్యక్షుడు మిగుల్ డయాజ్-కానెల్ అంగీకరించారు. విద్యుత్ ఉత్పత్తి, రవాణాకు అవసరమైన చమురు దిగుమతులు నిలిచిపోవడంతో క్యూబా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. వెనిజులాలో మదురో ప్రభుత్వం ఉన్నంతవరకు క్యూబాకు చమురు సరఫరా అయ్యేది, కానీ అక్కడ ప్రభుత్వం మారడంతో క్యూబాకు కష్టాలు మొదలయ్యాయి.


Posted

in

by

Tags: