బీహార్‌లోని సహర్సాలో ఒక ఇటుక బట్టీ యజమాని మహిళా కార్మికురాలిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె తొడలోకి దూసుకుపోవడంతో, ఆమె రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
యజమాని గదికి వెళ్లడానికి నిరాకరించినందుకే ఆమెపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అస్సాం నుండి వచ్చిన కార్మికులు మాట్లాడుతూ.. యజమాని ప్రతిరోజూ రాత్రి తమ భార్యలను లేదా కుమార్తెలను తన గదికి పంపాలని ఒత్తిడి తెచ్చేవాడని, నిరాకరిస్తే దాడులకు పాల్పడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు బట్టీపై దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాత్రి 2 గంటలకు పిలుపు: సదర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాధితులు అస్సాంకు చెందిన వలస కార్మికులు. వీరు నగరానికి సమీపంలోని హటియాగాఛీ వద్ద ఉన్న ఒక ఇటుక బట్టీలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో బట్టీ యజమాని ఔవేష్ కర్నీ అలియాస్ చున్నా, కార్మికుడి గది వద్దకు వచ్చి భార్యను లేదా కూతుర్ని తన గదికి పంపాలని వేధించాడు. ఈ క్రమంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, అడ్డుకున్న ఆమె తల్లిపై తుపాకీతో కాల్పులు జరిపాడు.
జేసీబీకి కట్టేసి కొడతానని బెదిరింపులు: “ఇది కేవలం నిన్నటి విషయం మాత్రమే కాదు, యజమాని ప్రతిరోజూ రాత్రి ఎవరో ఒక కార్మికుడిని నిద్రలేపి ఇలాగే వేధించేవాడు. మాట వినకపోతే జేసీబీకి కట్టేసి కొడతానని బెదిరించేవాడు. కొన్ని నెలల క్రితం మా బాబాయ్‌ని కూడా ఇలాగే కొట్టాడు, దాంతో ఆయన భయపడి ఇక్కడి నుండి పారిపోయారు” అని ఒక కార్మికుడు తెలిపాడు.
పోలీసుల చర్య: సహర్సా డీఎస్పీ ఓంప్రకాష్ మాట్లాడుతూ.. కాల్పుల ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు బట్టీపై దాడులు నిర్వహించి, అక్కడ పనిచేస్తున్న పలువురు అమ్మాయిలను రక్షించారని (Rescue) తెలిపారు. గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని చెప్పారు.
