“ఇదేం లిస్ట్.. పనికిరాదు!”.. తమిళనాడు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను తిరస్కరించిన రాహుల్ గాంధీ

చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుందగై తయారు చేసిన అభ్యర్థుల జాబితాను రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. కొత్త జాబితాను సిద్ధం చేసి మార్చి 30వ తేదీలోగా పంపాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియ వెనుక కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చలు, విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.

అభ్యర్థుల ఎంపికలో జాప్యం

డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు కేటాయించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేకపోయింది. జాతీయ పార్టీ కావడంతో ఏఐసీసీ ఆమోదం తప్పనిసరి. ఆ ఆమోదం లభించకపోవడమే ఈ ఆలస్యానికి కారణం.

జూమ్ మీటింగ్‌లో వాగ్వాదం

అభ్యర్థుల ఎంపికపై ఇటీవల నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో సీనియర్ నాయకుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ముఖ్యంగా పెన్నాగరం నియోజకవర్గంపై ఎంపీ కార్తీ చిదంబరం తీవ్రంగా స్పందించారు. పీఎంకే (PMK) గౌరవ అధ్యక్షుడు జీ.కే. మణి కుమారుడు తమిళ కుమరన్‌ను పార్టీలో చేర్చుకుని, ఆయనకు వెంటనే సీటు ఇవ్వాలన్న సెల్వపెరుందగై నిర్ణయాన్ని కార్తీ చిదంబరం తప్పుబట్టారు.

కార్తీ చిదంబరం ఏమన్నారంటే:

“తమిళ కుమరన్ ఏమైనా సచిన్ టెండూల్కరా? పార్టీలో చేరిన వెంటనే సీటు ఇవ్వడానికి? ఆయనకు కాంగ్రెస్‌కు అసలు సంబంధం ఏంటి? ఆయన కోసమే డీఎంకే నుండి పెన్నాగరం సీటును కోరి తీసుకున్నారా? దీని వెనుక ఏం జరిగిందో అందరికీ తెలుసు.” అని ఘాటుగా విమర్శించారు.

మరో ఎంపీ జోతిమణి కూడా గతంలోనే కాంగ్రెస్‌లో టిక్కెట్ల కేటాయింపులో అవినీతి జరుగుతోందని ఆరోపించిన నేపథ్యంలో, కార్తీ చిదంబరం వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.

రాహుల్ గాంధీ సీరియస్

తన మద్దతుదారులకే సీట్లు దక్కేలా సెల్వపెరుందగై నియోజకవర్గాలను ఎంచుకున్నారని, సీనియర్లను పక్కన పెట్టారని రాహుల్ గాంధీకి ఫిర్యాదులు అందాయి. 28 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను పరిశీలించిన రాహుల్ గాంధీ, అందులో చాలా మంది పేర్లపై పెన్సిల్‌తో రౌండ్ చుట్టి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ జాబితాను పూర్తిగా తిరస్కరిస్తూ, నిష్పక్షపాతంగా కొత్త జాబితాను రూపొందించి వెంటనే పంపాలని ఆదేశించారు. దీంతో తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఈ రచ్చ హాట్ టాపిక్ గా మారింది.


Posted

in

by

Tags: