ఒక ఏనుగుకు నిండుగా రంగులు వేసి నిర్వహించిన ఫోటోషూట్ ఇప్పుడు అంతర్జాలంలో పెద్ద చర్చకు దారితీసింది. కళాత్మక ప్రాజెక్టుల పేరుతో జంతువుల పట్ల అనుసరిస్తున్న పద్ధతులు మరియు వాటి సంక్షేమంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రష్యన్ ఫోటోగ్రాఫర్ జూలియా బురులేవా డిసెంబర్ 2025లో తీసిన ఈ ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. కొందరు దీనిని సృజనాత్మకత అని ప్రశంసించినప్పటికీ, మెజారిటీ నెటిజన్లు ఏనుగును హింసించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్ యశస్వి పాల్గొన్న ఈ షూట్, జైపూర్‌లోని ఒక పాత గణేశుడి ఆలయం వద్ద జరిగింది. ఎన్డీటీవీ (NDTV) నివేదికల ప్రకారం, ఈ ఏనుగు పేరు ‘చంచల్’. ఇది హథీ గావ్ (ఏనుగుల గ్రామం) ప్రాంతానికి చెందినది.
నిర్వాహకుల వివరణ: హథీ గావ్ కమిటీ అధ్యక్షుడు బల్లు ఖాన్ మాట్లాడుతూ.. చంచల్‌కు కేవలం ‘గులాల్’ (హోలీ రంగు) మాత్రమే పూశారని, 30 నిమిషాల్లోనే దానిని కడిగేశారని తెలిపారు. అప్పుడు 70 ఏళ్ల వయసున్న చంచల్, గత నెలలో మరణించింది. అయితే, ఆమె మరణానికి ఈ ఫోటోషూట్‌కు ఎలాంటి సంబంధం లేదని, వృద్ధాప్యం కారణంగానే సహజ మరణం పొందిందని అధికారులు స్పష్టం చేశారు.
ఫోటోగ్రాఫర్ దృక్పథం: జైపూర్ నగరంలోని గులాబీ రంగు తనను ప్రేరేపించిందని జూలియా తెలిపారు. రాజస్థాన్ సంస్కృతిలో ఏనుగులు ఒక ముఖ్య భాగమని, అందుకే వాటిని తన షూట్లో చేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు. వాడిన రంగులు సేంద్రియమైనవని (Organic), కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంచి వెంటనే కడిగేశామని ఆమె మరియు ఏనుగు యజమాని వాదించారు.
ప్రభుత్వ స్పందన: సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల నేపథ్యంలో, రాజస్థాన్ అటవీ శాఖ అధికారులు ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
