సీఎం యోగి తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మౌలానా అరెస్ట్; బీహార్‌లో దొరకబుచ్చుకున్న యూపీ పోలీసులు; అసలేం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మౌలానా అబ్దుల్లా సలీంను యూపీ ఎస్టీఎఫ్ (STF) బృందం అదుపులోకి తీసుకుంది. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నారు.

సీఎం తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు: మౌలానా అబ్దుల్లా సలీంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఆయన సీఎం యోగి తల్లిని ఉద్దేశించి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పలు సంఘాలు ఆయన వ్యాఖ్యలను రెచ్చగొట్టేవిగా, అమానవీయంగా అభివర్ణిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

మౌలానాపై వెల్లువెత్తిన నిరసనలు: యూపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. పరివర్తన్ చౌక్, గాంధీ పార్క్ పరిసరాల్లో మౌలానాకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే ఆ పోస్టర్లను తొలగించి, ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

అసలు గొడవకు కారణమేంటి?: రాష్ట్రంలో అమలులో ఉన్న గోవధ నిషేధ చట్టాలను విమర్శించే క్రమంలో మౌలానా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. “యూపీలో ఎంత కఠినమైన చట్టం తెచ్చారంటే.. ఎవరి వద్దనైనా ముఖ్యమంత్రి తల్లి మాంసం దొరికినా సరే, పోలీసులు వెంటనే వారిని ఎన్‌కౌంటర్ చేస్తారు లేదా కాళ్లలో కాల్పులు జరుపుతారు” అని ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీనిపై పలు జిల్లాల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం, భావాలను దెబ్బతీయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఎవరీ మౌలానా అబ్దుల్లా సలీం?: ఈయన పూర్తి పేరు అబ్దుల్లా సలీం కమర్ చతుర్వేది కాస్మీ. ఇస్లామిక్ ప్రసంగీకుడైన ఇతను బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. దారుల్ ఉలూమ్ దేవబంద్ నుండి ఇస్లామిక్ విద్యను అభ్యసించడంతో పాటు, సంస్కృత వ్యాకరణం కూడా చదివారు. గతంలో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM పార్టీలో ఉండేవారు. 2025లో ఆ పార్టీని వీడి, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన సూరాజ్’ పార్టీలో చేరారు. అయితే, ఎన్నికల సమయంలో ఆయన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించింది.


Posted

in

by

Tags: