ఇది కదా కమ్‌బ్యాక్ అంటే! మొదటి మ్యాచ్‌లోనే జెండా పాతిన నటరాజన్.. 3 వికెట్లతో ఊచకోత!

లక్నో: లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తరపున బరిలోకి దిగిన తమిళనాడు ఆటగాడు నటరాజన్ 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో గాయం కారణంగా నటరాజన్ మెజారిటీ మ్యాచ్‌లకు దూరమవ్వగా, ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్ 5వ మ్యాచ్‌లో లక్నో జట్టుతో ఢిల్లీ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం లక్నో ఇన్నింగ్స్ ప్రారంభించగా, రిషబ్ పంత్ – మిచెల్ మార్ష్ జోడీ ఓపెనింగ్‌కు వచ్చారు. ఇందులో పంత్ 7 పరుగులకే రన్ అవుట్ కావడంతో లక్నో పతనం మొదలైంది.

అబ్దుల్ సమద్ మాత్రమే బాధ్యతాయుతంగా ఆడి 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అలాగే మిచెల్ మార్ష్ 28 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అయినప్పటికీ 18.4 ఓవర్లలో లక్నో జట్టు కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బౌలర్లలో లుంగీ ఎన్గిడి మరియు నటరాజన్ చెరో 3 వికెట్లు తీశారు.

నటరాజన్ అద్భుత ప్రదర్శన
నటరాజన్ కు ఇది ఒక గొప్ప కమ్‌బ్యాక్ మ్యాచ్. గత సీజన్‌లో ఢిల్లీ జట్టు భారీ ధర వెచ్చించి నటరాజన్‌ను కొనుగోలు చేసినప్పటికీ, గాయం వల్ల అతను కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ ఢిల్లీ యాజమాన్యం నటరాజన్ మీద నమ్మకంతో అతన్ని రిటైన్ చేసుకుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నటరాజన్ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు.

పవర్ ప్లే ముగిసిన వెంటనే నటరాజన్ అటాకింగ్‌లోకి వచ్చాడు. ఆయుష్ బదోని వికెట్‌ను సులభంగా తీసిన అతను, మొదటి 2 ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 3వ ఓవర్‌లో నటరాజన్ కొంచెం పరుగులు ఇచ్చినప్పటికీ, చివరి ఓవర్‌లో మళ్ళీ పుంజుకున్నాడు. చివర్లో మెరుపులు మెరిపిస్తున్న అబ్దుల్ సమద్ మరియు మహమ్మద్ షమీ వికెట్లను పడగొట్టాడు.

మొత్తంగా 4 ఓవర్లు వేసిన నటరాజన్ 29 పరుగులు ఇచ్చి, 8 డాట్ బాల్స్ తో సహా 3 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో నటరాజన్ పెద్దగా వేగవంతమైన బంతులను వేయలేదు. 135 కి.మీ వేగం కంటే తక్కువగానే బంతులు వేశాడు. కొన్ని బంతులు 120 కి.మీ వేగంతో స్లో బాల్స్‌గా ఉన్నాయి. అయినప్పటికీ లైన్ అండ్ లెంగ్త్‌లో మాత్రం తడబడలేదు.

అలాగే గాయం నుండి కోలుకుని వచ్చినందున, శరీరంపై ఎక్కువ ఒత్తిడి ఇవ్వలేదు. బౌలింగ్ రన్ అప్‌లో కూడా నిదానంగానే ఉన్నాడు. దీనిని బట్టి ఈ సీజన్‌లో నటరాజన్ ఖచ్చితంగా తన ముద్ర వేస్తాడని అర్థమవుతోంది. కేవలం యార్కర్లే కాకుండా బౌన్సర్లు, లెంగ్త్ బంతులను కూడా నటరాజన్ వేయడం ప్రారంభించాడు.


Posted

in

by

Tags: