ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లో వివాహమైన మొదటి రాత్రే నవవధువు తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి, అతడిని ఆసుపత్రి పాలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
వివాహం ముగిసిన తర్వాత, నూతన వధూవరులను మొదటి రాత్రి గదిలోకి పంపించారు. ఆ సమయంలో వరుడు తన భార్య దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించగా, వధువు దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వరుడు పట్టుబట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు, అతడిని దారుణంగా కొట్టి, చెంపదెబ్బలు కొట్టి నానా రచ్చ చేసింది.
ఈ గొడవ ముదరడంతో, వధువు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుని వరుడిపై దాడి చేయడంతో అతని తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుడు, తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసుల విచారణలో, ఆ యువతికి ఈ వివాహం ఇష్టం లేదని, ఆమె వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ పెళ్లి చేశారని తేలింది.
ఈ విషయంపై వధువు సోదరి పోలీసులతో మాట్లాడుతూ.. తన సోదరికి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మొదటి నుండి ఇష్టం లేదనే విషయాన్ని ధృవీకరించింది.
పోలీస్ ఇన్స్పెక్టర్ జీత్ సింగ్ మాట్లాడుతూ, “వధువు తనను తాకవద్దని నిరాకరించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది; ప్రస్తుతం ఇరు వర్గాల వారు చర్చల ద్వారా రాజీకి వచ్చారు” అని తెలిపారు. పెళ్లయిన మొదటి రోజే వరుడు ఇలా దెబ్బలు తిని ఆసుపత్రి పాలవ్వడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
