సిమ్ కార్డ్ లాగే బ్యాంక్ మార్చుకోవచ్చు! ఆర్‌బీఐ ‘విజన్ 2028’ సరికొత్త ఆఫర్! కస్టమర్లకు పండగే!

ముంబై: మనం వాడుతున్న సెల్‌ఫోన్ నంబర్ మారకుండానే ఒక నెట్‌వర్క్ నుండి మరో నెట్‌వర్క్‌కు మారడం (పోర్టబిలిటీ) ఈ రోజుల్లో చాలా సులభం. సరిగ్గా అదే తరహా విప్లవాత్మక మార్పును బ్యాంకింగ్ రంగంలో కూడా తీసుకురావడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తీవ్రంగా ఆలోచిస్తోంది. దీని కోసం ఆర్‌బీఐ ‘పేమెంట్స్ విజన్ 2028’ అనే ప్రత్యేక ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం..

ఖాతా నంబర్ మారదు: ‘పేమెంట్స్ విజన్ 2028’ అనే కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా, కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతా నంబర్‌ను మార్చుకోకుండానే ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంక్‌కు సులభంగా మారిపోవచ్చు.

ప్రస్తుత ఇబ్బందులు: ప్రస్తుతం ఒక కస్టమర్ తన సేవింగ్స్ ఖాతాను ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్‌కు మార్చుకోవాలంటే ఎన్నో సాంకేతిక మరియు పరిపాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా:

  • పాత ఖాతాతో అనుసంధానమైన హోమ్ లోన్ ఈఎంఐలు (EMI).
  • మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు (SIP).
  • ఇన్సూరెన్స్ ప్రీమియంలు.
  • నెలవారీ జీతం వచ్చే వివరాలు. వీటన్నింటినీ కొత్త బ్యాంక్‌లో మళ్లీ మొదటి నుండి నమోదు చేయాలి. ఈ శ్రమకు, సమయం వృధా అవుతుందనే భయంతోనే చాలా మంది తమకు నచ్చకపోయినా లేదా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నా పాత బ్యాంక్ సేవల్నే వాడుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి ఆ ఖాతాకే వస్తుండటంతో వేరే దారి లేక ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతున్నారు.

పేమెంట్స్ స్విచ్చింగ్ సర్వీస్ (Payments Switching Service): కస్టమర్ల ఈ దీర్ఘకాలిక సమస్యను తీర్చడానికి ఆర్‌బీఐ “పేమెంట్స్ స్విచ్చింగ్ సర్వీస్” అనే కొత్త టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది ఒక కేంద్రీకృత వ్యవస్థగా పనిచేస్తుంది. దీని ద్వారా మీరు బ్యాంక్ మారాలని నిర్ణయించుకుంటే, కేవలం ఒక్క క్లిక్‌తో పాత బ్యాంక్‌లోని మీ లావాదేవీల ఆదేశాలన్నీ (Mandates) ఆటోమేటిక్‌గా కొత్త బ్యాంక్‌కు మారిపోతాయి. మీ లోన్ ఈఎంఐలు, పెట్టుబడులు ఎటువంటి అంతరాయం లేకుండా కొత్త బ్యాంక్ ద్వారా కొనసాగుతాయి. మీరు ప్రతి సంస్థకు వ్యక్తిగతంగా వెళ్లి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

లోన్ నుండి ఇన్సూరెన్స్ వరకు.. అంతా సులభం: ఈ సౌకర్యంలో అతిపెద్ద విశేషం ఏమిటంటే.. మీ బ్యాంక్ ఖాతా నంబర్ మారదు. కేవలం మీరు మారే కొత్త బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్‌సి (IFSC) కోడ్ మాత్రమే మారుతుంది.

కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు: ఈ పథకం అమలులోకి వస్తే బ్యాంకింగ్ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది.

  1. కస్టమర్లు ఎప్పుడైనా బ్యాంక్ మారే అవకాశం ఉండటంతో, బ్యాంకులు తమ కస్టమర్లను నిలుపుకోవడానికి మెరుగైన వడ్డీ రేట్లు, డిజిటల్ సేవలను అందించడానికి పోటీ పడతాయి.
  2. ఇది కస్టమర్లకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
  3. అంతర్జాతీయ స్థాయిలో నగదు బదిలీలను మరింత సులభతరం చేయడానికి కూడా ఆర్‌బీఐ ప్రణాళికలు రచిస్తోంది.

Posted

in

by

Tags: