వాషింగ్టన్: ఇరాన్ ఆయుధ సంపత్తికి సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనలను ఈ కొత్త నివేదిక సవాలు చేస్తోంది.
ఇరాన్ క్షిపణి నిల్వలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నట్లు ‘సిఎన్ఎన్’ (CNN) నివేదించింది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయని, కనీసం వెయ్యికి పైగా డ్రోన్లు ఇరాన్ వద్ద సిద్ధంగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. అమెరికా ధ్వంసం చేశామని చెప్పిన లాంచర్లు కూడా అవసరమైతే మళ్లీ పనిచేసే స్థితిలో ఉన్నాయని, వాటిని ఇరాన్ అత్యంత రహస్యంగా దాచి ఉంచిందని నివేదిక పేర్కొంది.
ఇరాన్ సైనిక బలం దాని రహస్య సొరంగాల నెట్వర్క్ మరియు మొబైల్ క్షిపణి లాంచర్లలో ఉందని నిపుణులు భావిస్తున్నారు. దాడులు జరిగిన వెంటనే ఈ లాంచర్లను వేగంగా వేరే చోటుకు తరలించడం వల్ల వాటిని గుర్తించడం కష్టమవుతోంది.
మరోవైపు, ఇరాన్ ఇంకా క్షిపణి దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్లు సమాచారం. అయితే, వైట్ హౌస్ ప్రతినిధులు మాత్రం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులలో 90 శాతం నశించాయని తమ పాత వాదననే పునరుద్ఘాటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా 12,000 పైగా లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసినప్పటికీ, ఇరాన్లో అధికార మార్పిడి గానీ లేదా కీలక సైనిక పతనం గానీ సంభవించలేదని ఈ నివేదిక సారాంశం.
