భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం స్వదేశీ అణుశక్తి జలాంతర్గామి INS అరిధామన్ను అధికారికంగా భారత నావికాదళంలోకి చేర్చారు. ఇదే సందర్భంలో యుద్ధనౌక ‘తారగిరి’ని కూడా ఆయన ప్రారంభించారు.
INS అరిధామన్ అంటే ఏమిటి? విశాఖపట్నంలోని ప్రాజెక్ట్ ATV కింద భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గాములలో ఇది మూడవది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ లో స్పందిస్తూ.. “ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు, ఇది శక్తికి చిహ్నం. అదే ‘అరిధామన్’!” అని పేర్కొన్నారు.
అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిస్సైల్ సబ్మెరైన్ల (SSBNs)ను తయారు చేసే అత్యంత రహస్య ప్రాజెక్టులో అరిధామన్ ఒక భాగం. దీని పూర్వగాములైన INS అరిహంత్ (2016), INS అరిఘాత్ (ఆగస్టు 2024) ఇప్పటికే శత్రువులకు సింహస్వప్నంగా మారగా, ఇప్పుడు అరిధామన్ చేరికతో భారత నౌకాదళం మరింత బలోపేతమైంది.
INS అరిధామన్ ఎంత శక్తివంతమైనది? అరిధామన్ అణుశక్తితో కూడిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగలదు. ఇది భారతదేశపు ‘న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం సముద్ర ఆధారిత అణు నిరోధక శక్తిని (Nuclear Deterrence) పెంపొందిస్తుంది. ఇది సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను మరియు భారీ పేలుడు పదార్థాలను (Payload) మోసుకెళ్లగలదు.
సాంకేతిక వివరాలు:
- తయారీ: విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ (SBC)లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ ప్రాజెక్ట్ కింద నిర్మించబడింది. దీనికి S4 లేదా SSBN 82 అనే గుర్తింపు ఉంది.
- రియాక్టర్: కల్పక్కంలోని ప్రోటోటైప్ నావల్ రియాక్టర్ నుండి రూపొందించిన 83 మెగావాట్ల (MW) కాంపాక్ట్ లైట్ వాటర్ ప్రెజరైజ్డ్ రియాక్టర్ దీనికి ఇంధనాన్ని అందిస్తుంది. ఇది ఒకే షాఫ్ట్ మరియు ఏడు బ్లేడ్ల ప్రొపెల్లర్‌తో నడుస్తుంది.
- క్షిపణి సామర్థ్యం: మునుపటి అరిహంత్ మరియు అరిఘాత్ లలో కేవలం 4 వర్టికల్ లాంచ్ సిస్టమ్ (VLS) ట్యూబ్‌లు ఉండగా, అరిధామన్ లో 8 VLS ట్యూబ్‌లు ఉన్నాయి. అంటే ఇది రెట్టింపు సంఖ్యలో క్షిపణులను మోసుకెళ్లగలదు.
- పరీక్షలు: 2021లో రహస్యంగా ప్రారంభించబడిన ఈ జలాంతర్గామి, 2022 నుండి సముద్ర పరీక్షలను (Sea trials) పూర్తి చేసుకుంది. 2025 మధ్య నాటికి ఆయుధ మరియు రియాక్టర్ తనిఖీలను విజయవంతంగా ముగించుకుని, ఇప్పుడు నౌకాదళంలోకి చేరింది.
