గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షం అంటే మానవుడికి ఎప్పుడూ కుతూహలమే. తాజాగా ‘ఆర్టెమిస్ 2’ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్న వేళ, ఒక విచిత్రమైన చర్చ మొదలైంది. అంతరిక్షంలో వ్యోమగాములు శారీరక సంబంధం కలిగి ఉండవచ్చా? అనేదే ఆ ప్రశ్న.
నాసా (NASA) వైఖరి: అంతరిక్షంలో వ్యోమగాములు ఎప్పుడైనా శారీరక సంబంధం పెట్టుకున్నారా అనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని నాసా ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి నిషేధం లేదు, కానీ నాసా దీనిని ప్రోత్సహించదు. వ్యోమగాములు వృత్తిపరంగా వ్యవహరించాలని, మిషన్ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి పనులు సరైనవి కావని మాజీ ఐఎస్ఎస్ (ISS) కమాండర్లు స్పష్టం చేస్తున్నారు.
గర్భధారణపై కఠిన నిషేధం: అంతరిక్షంలో గర్భం దాల్చడంపై మాత్రం పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. మైక్రోగ్రావిటీ (తక్కువ గురుత్వాకర్షణ) వాతావరణంలో పిండం ఎదుగుదలపై రేడియేషన్ ప్రభావం, శరీరంలోని ద్రవాల మార్పులు తీవ్ర ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది తల్లి ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
భౌతికశాస్త్రం అడ్డంకులు: న్యూటన్ మూడవ నియమం ప్రకారం, అంతరిక్షంలో ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. అంటే, ఇద్దరు వ్యక్తులు దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే, ఆ శక్తి వల్ల వారు ఒకరికొకరు దూరంగా విసిరివేయబడతారు. ఒకే చోట స్థిరంగా ఉండటమే అక్కడ పెద్ద సవాలు.
అంతేకాకుండా, జీరో గ్రావిటీలో శరీరంలోని రక్తం ఛాతీ, తల వైపు ఎక్కువగా ప్రవహిస్తుంది. దీనివల్ల ముఖం ఉబ్బినట్లు అనిపిస్తుంది. రక్తపోటు తగ్గడం మరియు పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం వల్ల లైంగిక వాంఛ (Libido) తగ్గిపోతుంది.
స్పేస్ సెక్సాలజీ మరియు 2సూట్ (2Suit): భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం పెరిగే అవకాశం ఉండటంతో ‘స్పేస్ సెక్సాలజీ’ అనే కొత్త పరిశోధనా విభాగం పుట్టుకొచ్చింది. అమెరికన్ రచయిత్రి వాన్నా బోంటా ‘2సూట్’ అనే ప్రత్యేక దుస్తులను డిజైన్ చేశారు. మైక్రోగ్రావిటీలో ఇద్దరు వ్యక్తులు విడిపోకుండా కలిసి ఉండటానికి ఈ సూట్‌కు వెల్క్రో (Velcro) పట్టీలు ఉంటాయి.
అడల్ట్ ఇండస్ట్రీ ప్రయత్నాలు: 2015లో ‘పోర్న్‌హబ్’ సంస్థ అంతరిక్షంలో అడల్ట్ ఫిల్మ్ చిత్రీకరించాలని ‘సెక్స్ప్లోరేషన్’ అనే ప్రాజెక్టును ప్రకటించింది. దీని కోసం 3.4 మిలియన్ డాలర్ల నిధులు సేకరించాలని ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైంది. అయితే, ‘ది యురేనస్ ఎక్స్పెరిమెంట్: పార్ట్ 2’ అనే సినిమాలో ప్రత్యేకంగా మార్పులు చేసిన విమానంలో జీరో-గ్రావిటీ సీన్‌ను చిత్రీకరించారు. కానీ అది కేవలం 20 సెకన్ల పాటు మాత్రమే సాధ్యమైంది. దీనిని బట్టి అంతరిక్షంలో ఇలాంటి పనులు ఎంత కష్టమో అర్థమవుతోంది.
