మనలో చాలా మందికి పొదుపు కోసం ఒక ఖాతా, జీతం కోసం మరొకటి, లోన్ EMIల కోసం ఇంకొకటి.. ఇలా రకరకాల బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. వీటన్నింటినీ నిర్వహించడం, ప్రతి దానికీ వార్షిక రుసుములు, డెబిట్ కార్డ్ ఛార్జీలు చెల్లించడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది.
‘పేమెంట్స్ విజన్ 2028’ (Payments Vision 2028): RBI తన తాజా ప్రణాళికలో భాగంగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ‘పేమెంట్స్ స్విచ్చింగ్ సర్వీస్’ (PaSS) అనే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు తమ వివిధ బ్యాంక్ ఖాతాలను, చెల్లింపులను ఒకే చోట నిర్వహించుకోవచ్చు.
మొబైల్ నంబర్ లాగే బ్యాంక్ అకౌంట్ కూడా.. ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్ నంబర్ మార్చకుండానే ఒక నెట్వర్క్ (ఉదాహరణకు జియో) నుండి మరొక నెట్వర్క్ (ఎయిర్టెల్)కు ఎలాగైతే మారిపోతున్నామో (Mobile Number Portability), భవిష్యత్తులో బ్యాంక్ ఖాతాలను కూడా అలాగే మార్చుకునే వెసులుబాటు రానుంది.
- మీ శాలరీ అకౌంట్, EMIలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు వంటివన్నీ పాత ఖాతాతోనే అనుసంధానమై ఉన్నా.. మీరు ఖాతా నంబర్ మార్చకుండానే సర్వీస్ నచ్చిన వేరే బ్యాంకుకు మారిపోవచ్చు.
- దీనివల్ల వినియోగదారులకు తమ ఆర్థిక లావాదేవీలపై పూర్తి నియంత్రణ లభిస్తుంది.
అంతర్జాతీయ స్థాయి చెల్లింపులు: కేవలం దేశీీయంగానే కాకుండా, అంతర్జాతీయ నగదు బదిలీల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు RBI కసరత్తు చేస్తోంది. G20 దేశాల ప్రమాణాలకు అనుగుణంగా మన పేమెంట్ వ్యవస్థను మార్చడం ద్వారా విదేశీ లావాదేవీల్లో జాప్యం తగ్గుతుంది. ఇది విదేశాల్లో ఉన్న భారతీయులకు (NRIs) మరియు వ్యాపారవేత్తలకు ఎంతో మేలు చేస్తుంది.
వినియోగదారులకే లాభం: ఈ కొత్త సంస్కరణల వల్ల బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతుంది. ఏ బ్యాంక్ అయితే మెరుగైన సేవలు అందిస్తుందో అటువైపే కస్టమర్లు మొగ్గు చూపుతారు. ఫలితంగా బ్యాంకులు తమ సేవా నాణ్యతను పెంచడమే కాకుండా, ఛార్జీలను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
