వాషింగ్టన్: సోషల్ మీడియా పుణ్యమా అని అప్పుడప్పుడు బ్రతికున్న ప్రముఖులపైనే మరణ వార్తలు వస్తుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా అదే జరిగింది. ఇంటర్నెట్లో ఒక్కసారిగా “Trump dead” అనే పదం ట్రెండింగ్లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఆయన ఆరోగ్యం విషమించిందని, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారని రకరకాల పోస్ట్లు వైరల్ అయ్యాయి.
అసలేం జరిగింది? వైట్ హౌస్ నుండి అకస్మాత్తుగా ఒక సమాచారం వెలువడింది. ఆ రోజు అధ్యక్షుడు ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అధికారులు ప్రకటించారు. సాధారణంగా అత్యంత చురుగ్గా ఉంటూ నిరంతరం ప్రజల మధ్య గడిపే ట్రంప్, ఒక్కసారిగా తన కార్యక్రమాలను రద్దు చేసుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఆయనను ఆసుపత్రికి తరలించారని, పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం మొదలుపెట్టారు.
వైట్ హౌస్ క్లారిటీ: ఈ పుకార్లను అమెరికా యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చాంగ్ మాట్లాడుతూ.. “అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన తన అధికారిక విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈస్టర్ వీకెండ్ సందర్భంగా కూడా ఆయన పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం” అని స్పష్టం చేశారు.
గతంలోనూ ఇలాంటి అనుమానాలే: ట్రంప్ ఆరోగ్యంపై చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన మెడ, చేతులపై కొన్ని గుర్తులు కనిపించాయి. అప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే, అవి కేవలం సాధారణ చర్మ చికిత్స (Routine Dermatological Treatment) వల్ల వచ్చిన గుర్తులని, వాటి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని అప్పట్లోనే అధికారులు వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియా విపరీత పోకడ: నేటి కాలంలో ఏదైనా చిన్న సమాచారం దొరికితే చాలు, నిర్ధారణ చేసుకోకుండానే వైరల్ చేయడం పరిపాటిగా మారింది. “Trump dead” అనే పదం ట్రెండ్ అవ్వడం కూడా ఇలాంటి అసంపూర్ణ సమాచారం వల్లే జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ వ్యక్తుల గురించి చిన్న మార్పు కనిపించినా అది ఇంటర్నెట్లో దావానంలా వ్యాపిస్తుందని, పౌరులు ఇలాంటి వదంతులను నమ్మకూడదని అమెరికా ప్రభుత్వం సూచించింది.
