న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రి పెమా ఖండూ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా ప్రాథమిక విచారణ (PE) ప్రారంభించాలని కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI)ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
10 ఏళ్ల కాంట్రాక్టులపై నిఘా:
జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. జనవరి 1, 2015 నుండి డిసెంబర్ 31, 2025 వరకు అరుణాచల్ ప్రదేశ్‌లో కేటాయించిన పబ్లిక్ వర్క్స్, కాంట్రాక్టులు మరియు వర్క్ ఆర్డర్లన్నింటినీ సీబీఐ విచారించాలని స్పష్టం చేసింది. ఈ విచారణకు సంబంధించి 16 వారాల్లోగా స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
రూ. 1,270 కోట్ల కుంభకోణం ఆరోపణలు:
గత పదేళ్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన నాలుగు సంస్థలకు సుమారు రూ. 1,270 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కాయని పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు వివరించారు. ముఖ్యంగా పెమా ఖండూ తండ్రి, మాజీ సీఎం దోర్జీ ఖండూ రెండో భార్య రించన్ డ్రేమాకు చెందిన ‘బ్రాండ్ ఈగల్స్’ సంస్థకు భారీగా కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇందులో స్పష్టమైన ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (ప్రయోజనాల సంఘర్షణ) ఉందని పిటిషనర్లు వాదించారు.
కీలక వ్యక్తులు ప్రతివాదులుగా:
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)లో ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు ఆయన కుటుంబ సభ్యులైన రించన్ డ్రేమా మరియు మేనల్లుడు త్సెరింగ్ తాషీలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాతే కోర్టు ఈ సీబీఐ విచారణకు మొగ్గు చూపింది.
మరోవైపు, ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమని రాష్ట్ర ప్రభుత్వం వాదించినప్పటికీ, నిధుల మళ్లింపు మరియు బంధుప్రీతి ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో సుప్రీంకోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లో సీబీఐ తన విచారణను ప్రారంభించనుంది.
