‘నేను 5 కోట్ల మంది భారతీయులు, పాకిస్థానీల ప్రాణాలు కాపాడాను’: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. నోబెల్ రాకపోవడంపై మళ్ళీ అసహనం!

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ముదురుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (ఏప్రిల్ 6) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్ మరియు పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపి, దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ఆయన క్లెయిమ్ చేశారు. వైట్ హౌస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

నేను 8 యుద్ధాలను అంతం చేశాను: ట్రంప్
“నేను ఇప్పటివరకు భారత్-పాకిస్థాన్ ఘర్షణతో సహా మొత్తం 8 యుద్ధాలను ముగించాను. పాకిస్థాన్ ప్రధాని కూడా స్వయంగా నాతో మాట్లాడుతూ.. నేను 30 నుంచి 50 మిలియన్ల (3 నుంచి 5 కోట్ల) మంది ప్రాణాలను కాపాడానని చెప్పారు,” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇంత చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ఆయన మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

‘మరో యుద్ధాన్ని ముగించాల్సి ఉంది’
ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్, “మనం మరో యుద్ధాన్ని కూడా ముగించాల్సి ఉంది” అని వ్యాఖ్యానించారు. అయితే అది ఇరాన్ యుద్ధమా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధమా లేక మరేదైనా అంతర్జాతీయ సంఘర్షణనా అన్నది ఆయన స్పష్టం చేయలేదు.

భారత్ ఖండించినా తగ్గని ట్రంప్
గత ఏడాది మే నెలలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఆ సమయంలో తానే జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. అయితే, భారత ప్రభుత్వం ఈ వాదనలను ఇప్పటికే పలుమార్లు ఖండించింది, ఏ మూడవ దేశం జోక్యం లేకుండానే పరిస్థితిని చక్కదిద్దామని స్పష్టం చేసింది.

మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం
ఇరాన్ విషయంలో తనకు మద్దతు ఇవ్వని నాటో (NATO) మిత్రదేశాలపై ట్రంప్ మండిపడ్డారు. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు కూడా అమెరికాకు అండగా నిలవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. “జపాన్, దక్షిణ కొరియాల రక్షణ కోసం మేము వేల సంఖ్యలో సైనికులను మోహరించాము, కానీ వారు మాత్రం మాకు సహాయం చేయడం లేదు” అని ఆయన ఫిర్యాదు చేశారు.


Posted

in

by

Tags: