గ్యాస్ సిలిండర్ ధరలో పన్ను ఎంత? ఒకవేళ టాక్స్ తీసేస్తే రూ. 913 సిలిండర్ ఎంతకు వస్తుంది?

మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ యుద్ధ భయాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సంఘర్షణల వల్ల గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడం, భారతదేశంలో వంటగ్యాస్ ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇటీవలే ప్రభుత్వం డొమెస్టిక్ మరియు కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచడంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులైంది. ఈ నేపథ్యంలో, చైంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ.. LPG మరియు PNG (పైప్డ్ గ్యాస్) పై పన్నులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌పై పన్ను ఎంత?

ప్రస్తుతం వంటగ్యాస్ మరియు పైప్డ్ గ్యాస్‌పై వేర్వేరు పన్నులు అమలులో ఉన్నాయి:

  • డొమెస్టిక్ సిలిండర్ (ఇంటి అవసరాలకు): దీనిపై ప్రస్తుతం 5% GST వసూలు చేస్తున్నారు.
  • కమర్షియల్ సిలిండర్ (హోటళ్లు, రెస్టారెంట్లు): దీనిపై ప్రభుత్వం ఏకంగా 18% GST విధిస్తోంది.
  • PNG (పైప్డ్ గ్యాస్): ఇది ఇంకా GST పరిధిలోకి రాలేదు. అందుకే వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరుగా VAT (వ్యాట్) విధిస్తున్నాయి. ఢిల్లీలో 5% వ్యాట్ ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో ఇది 14.5% వరకు ఉంది.
పన్ను రద్దయితే మీ జేబుకు ఎంత ఊరట?

ఒకవేళ ప్రభుత్వం CTI డిమాండ్ మేరకు పన్నులను రద్దు చేస్తే ధరలు ఇలా తగ్గుతాయి:

  1. డొమెస్టిక్ సిలిండర్: ఢిల్లీలో ప్రస్తుతం దీని ధర సుమారు రూ. 913. ఒకవేళ 5% పన్ను తొలగిస్తే, ఇది రూ. 43 తగ్గి రూ. 869.52 కి లభిస్తుంది.
  2. కమర్షియల్ సిలిండర్: దీనిపై భారీ ఊరట లభిస్తుంది. ప్రస్తుతం 18% GSTతో దీని ధర రూ. 2,078.50. పన్ను తీసేస్తే ఏకంగా రూ. 317 తగ్గి రూ. 1,761.44 కే వస్తుంది. దీనివల్ల బయట హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
PNG కనెక్షన్లకు పెరుగుతున్న డిమాండ్

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాల వల్ల చమురు మరియు గ్యాస్ సంక్షోభం ఏర్పడటంతో, ప్రజలు వేగంగా PNG కనెక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2026లో రోజుకు సగటున 686 కొత్త PNG కనెక్షన్లు వస్తుండగా, మార్చి నాటికి ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగి రోజుకు 2,000 కనెక్షన్లకు చేరుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం పన్నులు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని CTI నేతలు బ్రిజేష్ గోయల్, దీపక్ గార్గ్ కోరుతున్నారు.


Posted

in

by

Tags: