అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటినా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఇరాన్‌కు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన హెచ్చరిక జారీ చేశారు. అమెరికా తలచుకుంటే కేవలం ఒక్క రాత్రిలో ఇరాన్ అనే దేశాన్ని భూమిపై లేకుండా చేయగలదని ఆయన ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ గర్జన:
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో వరుస పోస్టులతో ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయన చేసిన హెచ్చరికలు ఇలా ఉన్నాయి:
- వినాశకర రాత్రి: “మొత్తం ఇరాన్ దేశాన్ని ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేయగలము. ఆ రాత్రి ఈరోజే కావచ్చు! ఇవాళ ఇరాన్‌కు ‘పవర్ ప్లాంట్స్ డే’ మరియు ‘బ్రిడ్జెస్ డే’ (విద్యుత్ కేంద్రాలు, వంతెనల అంతం) అవుతుంది. అటువంటి దాడిని మీరు చరిత్రలో చూసి ఉండరు.”
- నరకం చూస్తారు: “హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవండి. మూర్ఖంగా ప్రవర్తించకండి.. లేదంటే మీరు నరకాన్ని చూస్తారు” అంటూ ఘాటుగా స్పందించారు.
ట్రంప్ ప్లాన్ ఏంటి?
సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, కేవలం వంతెనలు, విద్యుత్ కేంద్రాలే కాకుండా అంతకంటే భయంకరమైన ‘ఆప్షన్స్’ కూడా తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.
- తక్షణ విధ్వంసం: యుద్ధం ఎప్పుడు ఆపాలో నిర్ణయించే అధికారం తన దగ్గరే ఉందని, తాను ఆదేశిస్తే కొద్ది గంటల్లోనే ఇరాన్ మౌలిక సదుపాయాలన్నీ పేలిపోతాయని చెప్పారు.
- ఆయిల్ నిల్వలపై కన్ను: ఇరాన్ చమురు సంపదను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అమెరికా ప్రజలు కేవలం యుద్ధం ముగించి సైనికులు వెనక్కి రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ప్రజా తిరుగుబాటుపై ఆశలు:
ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇరాన్ ప్రజలకు తమ ప్రాణాలకు ముప్పు లేదని నమ్మకం కలిగితే, వారు ప్రస్తుత పాలకులపై తిరుగుబాటు చేస్తారని, ఆయుధాలు పడితే కేవలం రెండు సెకన్లలో ఇరాన్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
