లైఫ్ స్టైల్ డెస్క్: మనలో చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి స్ట్రాంగ్ టీ పడాల్సిందే. ఆ టీ చిక్కగా, రుచిగా ఉంటేనే ఆ కిక్కే వేరు. కానీ కొన్నిసార్లు ఇంట్లో పాలు తక్కువగా ఉన్నా లేదా పాలు బాగా పల్చగా ఉన్నా టీ నీళ్లలా వస్తుందని బాధపడుతుంటాం. ముఖ్యంగా చుట్టాలు వచ్చినప్పుడు పాలు సరిపోకపోతే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే, పాలు తక్కువగా ఉన్నా సరే, అమృతంలో ఉండే టీని ఎలా తయారు చేయాలో మా అమ్మమ్మ ఒక అద్భుతమైన చిట్కా చెప్పింది. అదేంటో ఇప్పుడు చూద్దాం!
తక్కువ పాలతో చిక్కటి టీ.. తయారీ విధానం ఇదే:
స్టెప్ 1: పాలను సిద్ధం చేసుకోండి ముందుగా మీ దగ్గర ఉన్న పాలకు తగినంత నీరు కలపండి. ఉదాహరణకు ఒక కప్పు పాలు ఉంటే, రెండు కప్పుల నీరు పోసి పరిమాణాన్ని పెంచండి. ఒకవేళ పాలు ఇప్పటికే చాలా పల్చగా ఉంటే మరిన్ని నీళ్లు పోయకండి.
స్టెప్ 2: పాలను మరిగించండి చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే.. పాలు వేడెక్కక ముందే అల్లం, టీ పొడి వేసేస్తుంటారు. అలా కాకుండా, పాలు కనీసం ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. అప్పుడే టీకి అసలైన రుచి వస్తుంది.
స్టెప్ 3: మసాలాల మ్యాజిక్ పాలు మరిగిన తర్వాత టీ పొడి వేసి, మంటను తగ్గించి ఒక నిమిషం పాటు మరగనివ్వండి. ఆ తర్వాత దంచిన అల్లం, మిరియాలు, లవంగాలు, యాలకులు వేయండి. మీకు మసాలా టీ ఇష్టమైతే చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా చేర్చవచ్చు. ఇలా తక్కువ మంట మీద 2-3 నిమిషాలు మరిగిస్తే మసాలాల వాసన టీకి బాగా పడుతుంది.
స్టెప్ 4: ఇదే ఆ అసలైన ‘సీక్రెట్’! ఇప్పుడు మీ టీని చిక్కగా మార్చే ఆ రహస్య పదార్థం వేయాలి. అదే మిల్క్ పౌడర్ (పాల పొడి). కొద్దిగా గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో మిల్క్ పౌడర్ కలిపి ఉండలు లేకుండా పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న టీలో పోస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరగా చక్కెర వేసి మరో రెండు నిమిషాలు మరిగిస్తే చాలు.
