కాన్పూర్/బెగుసరాయ్: కాన్పూర్ కిడ్నీ రాకెట్ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. చదువుకోవడానికి ఫీజు కట్టలేక, గతిలేక తన కిడ్నీని అమ్ముకున్నానంటూ సోషల్ మీడియాలో సానుభూతి పొందిన ఆయుష్ కథ ఇప్పుడు పూర్తిగా అడ్డం తిరిగింది. ఆయుష్ చెప్పినవన్నీ అబద్ధాలని, విలాసాల కోసమే అతను ఈ దారి ఎంచుకున్నాడంటూ అతని సొంత ఊరి ప్రజలే షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
మొదట్లో చెప్పిన కథకు.. అసలు నిజానికి పొంతనే లేదు!
బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా, ఔగాన్ గ్రామానికి చెందిన ఆయుష్ తండ్రి రాజేష్ చౌదరి ఒకప్పుడు ఆ ఊరిలో పెద్ద జమీందారు. కొడుకును డాక్టరును చేయాలని కోటి ఆశలతో విశాఖపట్నంలోని ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. కానీ అక్కడే ఆయుష్ జీవితం గాడి తప్పింది. అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడటం, చదువును నిర్లక్ష్యం చేయడం మొదలైంది.
నిజాలు నిగ్గుతేల్చిన గ్రాస్థులు:
- 15 ఎకరాల భూమి ఏమైంది?: భూమిని తాకట్టు పెట్టి ఫీజు కట్టానని ఆయుష్ చెప్పిన మాటల్లో నిజం లేదని తేలింది. తండ్రి మరణం తర్వాత తన వాటాకు వచ్చిన 15 ఎకరాల భూమిని ఆయుష్ విలాసాల కోసం అమ్మేసుకున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు.
- ఎయిర్ హోస్టెస్‌తో ప్రేమాయణం: యూపీకి చెందిన ఒక ఎయిర్ హోస్టెస్‌ను ప్రేమించి, 2018లో ఊరికి తీసుకొచ్చాడు. సామాజిక ఒత్తిడితో దేవఘర్లో పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆయుష్ విచ్చలవిడితనం భరించలేక మూడు నెలలకే ఆమె అతన్ని వదిలి వెళ్లిపోయింది.
- విలాసాల కోసం వేల రూపాయల ఖర్చు: ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బును స్నేహితులతో తిరగడానికి, జల్సాలకు ఖర్చు చేశాడని, ఆ తర్వాతే చేతిలో చిల్లిగవ్వ లేక ఈ కిడ్నీ రాకెట్లో చిక్కుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
ఒంటరిగా తల్లి.. తమ్ముడు కూడా వద్దన్నాడు!
2021 తర్వాత ఆయుష్ తన గ్రామానికి వెళ్లలేదు. ఒకసారి వెళ్లినప్పుడు అతని తమ్ముడు ఇంట్లోకి రానివ్వకపోవడంతో, ఊరితో సంబంధాలు తెంచుకున్నాడు. ప్రస్తుతం అతని తల్లి గ్రామంలో ఒంటరిగా దయనీయ స్థితిలో బతుకుతుండగా, ఆయుష్ పేరు ఎత్తితేనే గ్రామస్థులు ఛీత్కరించుకుంటున్నారు.
