న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ (Ceasefire) కుదిరినట్లు వెలువడిన ప్రకటన ప్రపంచ ఇంధన మార్కెట్‌లో పెను మార్పులకు దారితీసింది. బుధవారం మార్కెట్ ప్రారంభం కావడమే భారీ పతనంతో మొదలైంది. ఇది సామాన్యులకు ఊరటనిచ్చే అంశం కాగా, గ్లోబల్ ఎకానమీకి కొత్త ఊపిరి పోసింది.
ఒక్కరోజే 19 శాతం పతనం.. ఏకంగా $91కి చేరిన ధర!
అమెరికా క్రూడ్ ఆయిల్ ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం కొన్ని గంటల్లోనే 19 శాతం మేర పడిపోయాయి.
- అమెరికన్ క్రూడ్: నిన్నటి వరకు బ్యారెల్‌కు 116 డాలర్లు ఉన్న ధర, ఏకంగా 26 డాలర్లు తగ్గి ప్రస్తుతం 91 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
- బ్రెంట్ క్రూడ్ (గల్ఫ్ దేశాలు): గల్ఫ్ దేశాల ముడి చమురు ధర కూడా 15 శాతం పడిపోయింది. నిన్న 109 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడ్, నేడు 92.82 డాలర్లకు దిగివచ్చింది.
ఈ భారీ పతనం వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఎల్‌పీజీ (LPG), ఎల్‌ఎన్‌జీ (LNG) సంక్షోభం కూడా సద్దుమణుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
రంగంలోకి పాకిస్థాన్.. 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!
ఏప్రిల్ 7 డెడ్‌లైన్ ముగియడానికి ముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించడం విశేషం. ఈ సంధిలో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించనుంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 షరతులపై ఏప్రిల్ 10 నుండి ఇస్లామాబాద్‌లో చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు వారాల విరామం తర్వాతే యుద్ధం కొనసాగుతుందా లేదా శాంతి నెలకొంటుందా అన్నది తేలనుంది.
యుద్ధం నేపథ్యం: ఫిబ్రవరి 28, 2026న ఇరాన్ అణు కార్యక్రమమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. మూడు దఫాల చర్చలు విఫలమైన తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఏప్రిల్ 7 వరకు భీకరంగా సాగిన ఈ పోరుకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది.
