బీహార్: ప్రేమించిన వాడు పెళ్లికి నో చెప్పాడని ఆగ్రహించిన ఒక యువతి, ఏకంగా వంద అడుగుల హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బీహార్‌లోని వైశాలి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ హైడ్రామా చివరకు పోలీసుల వినూత్న హామీతో సుఖాంతమైంది.
అసలేం జరిగిందంటే?
మహ్నార్ ప్రాంతానికి చెందిన ఒక యువతి, స్థానికంగా ఉండే యువకుడిని గాఢంగా ప్రేమించింది. అయితే ఆ యువకుడు తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో తట్టుకోలేకపోయిన ఆమె, ఆవేశంతో సుమారు 1.32 లక్షల వోల్టుల విద్యుత్ ప్రవహించే హైటెన్షన్ టవర్ పైకి ఎక్కింది. చేతిలో సెల్‌ఫోన్‌తో టవర్ అంచున నిలబడి, దూకేస్తానంటూ కేకలు వేయడంతో స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు.
9 గంటల పాటు ఉత్కంఠ
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదాన్ని పసిగట్టిన విద్యుత్ శాఖ అధికారులు ఆ లైన్లో పవర్ కట్ చేశారు. సమయం గడుస్తున్నా ఆమె దిగిరాకపోవడంతో నాలుగు పోలీస్ స్టేషన్ల నుండి వందకు పైగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయం కావడంతో భారీగా సెర్చ్ లైట్లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీస్ ఆఫీసర్ “ఎమోషనల్” రిక్వెస్ట్
ఈ క్రమంలో ఒక పోలీస్ అధికారి మైక్ పట్టుకుని చేసిన విన్నపం నెట్టింట వైరల్ అవుతోంది.
“తల్లీ.. పిచ్చి పనులు చేసి నా ఉద్యోగం ఊడగొట్టకు. నువ్వు కిందకు దిగి రా.. గంటలో మీ పెళ్లి నేనే జరిపిస్తాను!” అంటూ ఆయన బ్రతిమిలాడారు.
మరో అధికారి ఏకంగా ఆమె మొబైల్ ఫోన్‌కు కాల్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు ఆమె ప్రియుడిని వెతికి పట్టుకుని ఘటనా స్థలానికి తీసుకురావడంతో, అతడిని చూడగానే ఆ యువతి శాంతించి కిందకు దిగివచ్చింది.
తర్వాతి సీన్ ఏంటంటే?
యువతి సురక్షితంగా కిందకు దిగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆమె కోరినట్లు వెంటనే పెళ్లి జరగలేదు. ప్రస్తుతానికి రెండు కుటుంబాలను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రేమ కోసం ప్రాణాలకు తెగించి ఆమె చేసిన ఈ సాహసం ఇప్పుడు బీహార్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
