న్యూఢిల్లీ: సామాన్యుడి నెత్తిన పిడుగులా పడుతున్న విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ‘పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం’ ద్వారా మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే, ఇకపై కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే ఉండదు. అంతేకాదు, ప్రభుత్వం ఏకంగా రూ. 78,000 వరకు ఆర్థిక సాయం అందిస్తూ, మిగిలిన ఖర్చుకు అతి తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పిస్తోంది.
సబ్సిడీ లెక్కలు ఇవే: ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే?
ఈ పథకం కింద మీరు ఏర్పాటు చేసుకునే సోలార్ సిస్టం సామర్థ్యాన్ని బట్టి మీ బ్యాంక్ ఖాతాకే నేరుగా నగదు జమ అవుతుంది.
- 1 కిలోవాట్: రూ. 30,000 సబ్సిడీ.
- 2 కిలోవాట్లు: రూ. 60,000 సబ్సిడీ.
- 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ: గరిష్టంగా రూ. 78,000 వరకు ప్రభుత్వం భరిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్: గ్యారెంటీ అక్కర్లేదు!
సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అయ్యే మిగిలిన ఖర్చు కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) విప్లవాత్మకమైన లోన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
- తక్కువ వడ్డీ: కేవలం 5.75% వార్షిక వడ్డీతో రూ. 2 లక్షల వరకు రుణం పొందవచ్చు.
- షరతులు లేవు: రూ. 2 లక్షల లోపు రుణానికి ఎలాంటి హామీ (గ్యారెంటీ) ఇవ్వనక్కర్లేదు. ఇన్‌కమ్ ప్రూఫ్ లేదా శాలరీ స్లిప్పులతో సంబంధం లేదు.
- అర్హతలు: వయస్సు 21 ఏళ్లు దాటి ఉండాలి. సొంత ఇల్లు, మీ పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండి, సిబిల్ స్కోరు 680 పైన ఉంటే చాలు. కేవలం 15-20 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
10 ఏళ్ల గడువు.. ఈఎంఐ టెన్షన్ లేదు!
ఈ అప్పు తీర్చడానికి బ్యాంకు ఏకంగా 10 ఏళ్ల (120 నెలలు) సుదీర్ఘ గడువు ఇస్తోంది.
- మొరటోరియం: మొదటి 6 నెలల పాటు ఎలాంటి వాయిదాలు కట్టాల్సిన అవసరం లేదు.
- సబ్సిడీ సర్దుబాటు: ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా మీ లోన్ ఖాతాలో జమవుతుంది. దీనివల్ల అసలు సొమ్ము తగ్గిపోయి, నెలవారీ ఈఎంఐ భారం చాలా వరకు తగ్గుతుంది.
నెట్ మీటరింగ్: మిగిలిన విద్యుత్ అమ్మేయొచ్చు!
ఈ పథకంలో మరో హైలైట్ ఏమిటంటే.. మీ ఇంటి అవసరాలకు పోను మిగిలిన విద్యుత్‌ను మీరు తిరిగి ప్రభుత్వానికే అమ్మవచ్చు. ‘నెట్ మీటరింగ్’ ద్వారా మీరు గ్రిడ్‌కు పంపే యూనిట్లను బట్టి మీ విద్యుత్ బిల్లులో క్రెడిట్ జమవుతుంది. దీనివల్ల మీ కరెంటు బిల్లు సున్నా అవడమే కాకుండా, ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది.
దరఖాస్తు చేసుకోండిలా: ఆసక్తి గల వారు వెంటనే pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, మొబైల్ నంబర్ ఉంటే చాలు.. మీ ఇంటిని సోలార్ హౌస్‌గా మార్చుకోవచ్చు.
ఇక కరెంటు బిల్లుల టెన్షన్‌కు స్వస్తి పలికి.. సూర్యరశ్మితో మీ ఇంటిని వెలిగించుకోండి!
