పెళ్లైన నెలకే నూరేళ్ల మంట: పుట్టింట్లో విందుకి వచ్చి అనంతలోకాలకు.. నవవధువు దేవిశ్రీ ఆత్మహత్య వెనుక మిస్టరీ ఏంటి?

మధురై:పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ ఆ యువతి జీవితంలో మాత్రం అది నూరేళ్ల మంటగా మారింది. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నెల రోజులకే, పచ్చని సంసారంలో చిచ్చు రేగింది. పుట్టింటికి విందుకు వచ్చిన చోటే ఆ నవవధువు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కళాశాల నుంచి వచ్చి.. గదిలో విగతజీవిగా!
మధురై సమీపంలోని పరవై ప్రాంతానికి చెందిన మూర్తి కుమార్తె దేవిశ్రీ (19). ఈమె ఒక ప్రైవేట్ కళాశాలలో బీకామ్ మూడవ సంవత్సరం చదువుతోంది. గత నెల మార్చి 5వ తేదీన అదలై గ్రామానికి చెందిన న్యాయవాది పుష్పవనం (28)తో దేవిశ్రీకి ఘనంగా వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆనవాయితీ ప్రకారం ఈ జంట పుట్టింటికి విందుకు వచ్చారు.

సంఘటన జరిగిన రోజు ఉదయం భర్త పుష్పవనం కోర్టుకు వెళ్లగా, దేవిశ్రీ కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె తల్లి వసంత బయటకు వెళ్తూ దేవిశ్రీని ఇంట్లో ఉంచి వెళ్ళింది. తీరా తల్లి తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు లోపల నుండి గడియ పెట్టి ఉన్నాయి. ఎంత పిలిచినా పలకకపోవడంతో తండ్రికి సమాచారం అందించారు. తండ్రి వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దేవిశ్రీ వేలాడుతూ కనిపించింది.

ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మధురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పెళ్లైన నెల రోజులకే ఈ ఘోరం జరగడంతో సమయ నల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహమైన ఏడేళ్లలోపు ఇటువంటి ఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం ఆర్డీఓ (RDO) విచారణ చేపట్టారు.

మనస్పర్థలే కారణమా?
పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడం సహజమే అయినా, అవి ప్రాణాలు తీసుకునేంత స్థాయికి వెళ్లడం విచారకరం. ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఓర్పు వహించాల్సింది పోయి, ఇలా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. దేవిశ్రీ ఆత్మహత్యకు అసలు కారణం భర్తతో గొడవలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.


Posted

in

by

Tags: