భారతీయ ‘బంగారు’ గనులపై ప్రపంచం కన్ను! ఇళ్లలోనే $5 లక్షల కోట్ల నిధి.. దేశం జిడిపి రాత మారబోతోందా?

న్యూఢిల్లీ: భారతీయ ఇల్లాళ్ల దగ్గర ఉన్న పసుపు లోహం విలువ ఇప్పుడు ప్రపంచంలోని అగ్ర దేశాల సెంట్రల్ బ్యాంకుల నిల్వలను కూడా దాటేసింది. మన ఇళ్లలో ఉన్న బంగారం విలువ అక్షరాలా 5 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 415 లక్షల కోట్లు) చేరిందని ‘అసోచామ్’ (ASSOCHAM) విశ్లేషణ వెల్లడించింది. ప్రపంచంలోని టాప్-10 బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం నిల్వల కంటే భారతీయుల వ్యక్తిగత బంగారమే ఎక్కువ కావడం విశేషం.

జీడీపీకి ‘బంగారు’ కిక్!

ఈ అపారమైన నిధిని కేవలం బీరువాల్లో దాచుకోకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం చేస్తే భారత్ ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించడం ఖాయం. నివేదికలోని ముఖ్యాంశాలు ఇవే:

  • గేమ్ ఛేంజర్: ఇళ్లలో ఉన్న బంగారంలో కేవలం 2 శాతం ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ మార్కెట్లోకి వస్తే, దేశ ఆర్థిక వృద్ధి రేటు ఊహించని స్థాయికి చేరుకుంటుంది.
  • 2047 లక్ష్యం: వచ్చే 20 ఏళ్లలో (వికసిత్ భారత్ – 2047 నాటికి) ఈ బంగారంలో 40 శాతం విత్త లావాదేవీల్లోకి మారితే, భారత జీడీపీకి అదనంగా 7.5 ట్రిలియన్ డాలర్లు తోడవుతాయి.
  • $40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ: 2047 నాటికి భారత్ 34 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధిస్తుందని అంచనా. అయితే, ఈ బంగారు నిధి తోడైతే మన ఆర్థిక వ్యవస్థ ఏకంగా 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతుంది.
పెరుగుతున్న గోల్డ్ లోన్స్.. మారుతున్న ధోరణి!

బంగారాన్ని కేవలం సెంటిమెంట్‌గా కాకుండా, అవసరానికి ఉపయోగపడే ఆస్తిగా భారతీయులు చూడటం మొదలుపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (నవంబర్ 2025 నాటికి) బంగారంపై తీసుకున్న రుణాల విలువ రూ. 24.34 లక్షల కోట్లకు చేరింది. ఇది ప్రజలు తమ ఆస్తులను ఆర్థిక వ్యవస్థలోకి తెస్తున్నారనే దానికి స్పష్టమైన సంకేతం.


Posted

in

by

Tags: