మచిలీపట్నం బ్యూరో: ప్రేమకు రంగు, రూపం, కులం, మతం అనే తేడాలు లేవని.. అది కేవలం రెండు మనసుల కలయిక అని ఈ జంట నిరూపించింది. సమాజం చూసే చిన్నచూపును, కుటుంబ సభ్యుల తీవ్ర వ్యతిరేకతను పక్కనపెట్టి.. శారీరక వైకల్యాన్ని సైతం ప్రేమతో జయించింది ఈ జంట. తనకంటే ఎంతో పొట్టిగా ఉన్న వ్యక్తిని ప్రాణప్రదంగా ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఓ యువతి సాహసం ఇప్పుడు కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
స్కూల్ డేస్‌లోనే చిగురించిన ప్రేమ: మచిలీపట్నం రాజుపేటకు చెందిన వేముల శశి, అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి ప్రేమకథ ఏ సినిమా కథకూ తీసిపోదు. వీరిద్దరి పరిచయం స్కూల్ రోజుల్లోనే మొదలైంది. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో మొదట స్నేహితులుగా మారిన వీరు, కాలక్రమేణా ప్రేమలో పడ్డారు. శశి శారీరకంగా పొట్టిగా (Dwarf) ఉన్నప్పటికీ, అతని వ్యక్తిత్వం, మనసు నచ్చిన ఆ యువతి.. అందం కంటే గుణమే మిన్న అని నమ్మింది. జీవితాంతం తన ప్రయాణం శశితోనే అని నిశ్చయించుకుంది.
అడ్డంకుల కొండ.. కుటుంబ సభ్యుల ఆంక్షలు: వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియగానే గొడవలు మొదలయ్యాయి. ఈ వివాహానికి ప్రధానంగా రెండు అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకటి మతం కాగా, రెండోది శశి శారీరక స్థితి. శశి పొట్టిగా ఉన్నాడనే కారణంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. “చూడటానికి ఎంతో అందంగా ఉన్న నువ్వు, అతడిని పెళ్లి చేసుకుంటే సమాజం ఏమనుకుంటుంది?” అంటూ ఎద్దేవా చేశారు. కానీ ఆ యువతి తన పంతం వీడలేదు.
ప్రాణభయం.. పోలీసుల ఆశ్రయం: రోజురోజుకూ కుటుంబం నుంచి ఒత్తిడి పెరగడం, ప్రాణహాని ఉందని గ్రహించిన ఈ జంట.. ఎలాగైనా తమ ప్రేమను నిలబెట్టుకోవాలని రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం రక్షణ కల్పించాలంటూ మచిలీపట్నంలోని ఇనుకుడురుపేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల నుండి తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు.
వృత్తిరీత్యా ఇద్దరూ కష్టజీవులే: ప్రస్తుతం వేముల శశి జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం చేస్తుండగా, యువతి ఒక మెడికల్ షాపులో పని చేస్తూ స్వయం సమృద్ధిగా జీవిస్తున్నారు. పేదరికం కానీ, శారీరక లోపాలు కానీ ప్రేమకు ఎప్పుడూ అడ్డుకాకూడదన్నదే ఈ జంట ఆశయం.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు: ఈ జంట ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆ యువతి ధైర్యాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. “బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యమే ముఖ్యమని నిరూపించారు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ప్రేమకు కళ్లు లేవు’ అంటారు కానీ, ఈ జంట మాత్రం ప్రేమకు గొప్ప ‘మనసు’ ఉందని చాటి చెప్పారు.
