ఇస్లామాబాద్: ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శనివారం జరగనున్న శాంతి చర్చల వేళ ఒక గుండెను పిండేసే దృశ్యం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా మొదట చర్చలకు రావడానికి నిరాకరించిన ఇరాన్, చివరి నిమిషంలో మనసు మార్చుకుని పాకిస్థాన్ చేరుకుంది. అయితే, వారు ఉత్త చేతులతో రాలేదు.. తమ దేశంలో అమెరికా జరిపిన దాడిలో విగతజీవులైన పసిపిన్నల రక్తపు మరకల సాక్ష్యాలను వెంటబెట్టుకొచ్చారు.
ప్రపంచాన్ని కదిలిస్తున్న ఆ ఫోటో!
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ విమానంలో కొన్ని ప్రత్యేక వస్తువులను తీసుకువచ్చారు. హోర్మోజ్గాన్ ప్రాంతంలోని మీనాబ్ ‘తయ్యబే’ పాఠశాలపై అమెరికా జరిపిన టోమాహాక్ మిసైల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినుల రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఫోటోలను విమాన సీట్లపై ఉంచారు. అమెరికా జరిపిన ఈ అమానుష దాడిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇరాన్ ఈ వినూత్న నిరసనను చేపట్టింది.
ట్వీట్‌తో అమెరికాకు చురకలు..
ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ ఈ ఫోటోలను ‘X’ (ట్విట్టర్)లో షేర్ చేస్తూ.. “పాకిస్థాన్‌లో జరుగుతున్న శాంతి చర్చల ప్రయాణంలో ఈ చిన్నారులే మా సహచరులు” అంటూ భావోద్వేగంగా రాశారు. ఈ దాడిలో 165 మందికి పైగా మరణించగా, అందులో అత్యధికులు చిన్నారులే కావడం గమనార్హం. పాత ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పొరపాటున ఈ స్కూల్‌పై దాడి జరిగిందని అమెరికా సైన్యం ప్రాథమికంగా వెల్లడించింది.
చర్చల కోసం సిద్ధమైన వేదిక..
మరోవైపు ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ నేతృత్వంలోని బృందం చర్చల్లో పాల్గొంటోంది.
- ఇరాన్ పట్టు: తమ దేశంలో స్తంభింపజేసిన ఆస్తుల విడుదల మరియు లెబనాన్ సీజ్ఫైర్ వంటి అంశాలపై ముందుగా అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తోంది.
- ట్రంప్ ధీమా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలపై ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. “హోర్ముజ్ జలసంధి త్వరలోనే తెరుచుకుంటుంది. ఇరాన్ సహకరించినా, చేయకపోయినా మేము గల్ఫ్ మార్గాన్ని తెరుస్తాం” అని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
విచక్షణారహిత దాడి – మీనాబ్ ఊచకోత!
ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో మీనాబ్లోని రివల్యూషనరీ గార్డ్స్ బేస్ సమీపంలో ఉన్న స్కూల్‌పై అమెరికా టోమాహాక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటన పశ్చిమాసియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇప్పుడు అదే దాడి తాలూకు చేదు జ్ఞాపకాలను వెంటబెట్టుకుని ఇరాన్ చర్చల బల్ల ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ సిద్ధమైనప్పటికీ, పాత గాయాలు మరియు ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి.
