న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. ఆయనే 15 ఏళ్ల కుర్ర కెరటం వైభవ్ సూర్యవంశీ! అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగుల వీరవిహారంతో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ఈ బీహార్ మొనగాడు, ఇప్పుడు ఏకంగా ‘ఆరెంజ్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు బాది విధ్వంసం సృష్టించాడు. అయితే, విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన తర్వాత వైభవ్ బ్యాట్‌ను నేలకేసి కొడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
300 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత!
ఆర్సీబీ బౌలర్లను టార్గెట్ చేసిన వైభవ్, మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజ బౌలర్ల పేర్లను కూడా లెక్కచేయకుండా.. 7 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ వైపు దూసుకెళ్తున్న తరుణంలో, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
విరాట్ క్యాచ్ పట్టాక ఆ కోపం ఎందుకు?
సాధారణంగా అంత పెద్ద ఆటగాడు క్యాచ్ పడితే నిరాశ చెందడం సహజం. కానీ వైభవ్ మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే వరకు తనపై తాను కోపంతో ఊగిపోయాడు. దీనిపై మ్యాచ్ అనంతరం స్పందిస్తూ అసలు కారణం వెల్లడించాడు.
“నేను ప్రాక్టీస్‌లో ఏం చేస్తానో, మైదానంలో కూడా అదే చేయాలనుకుంటాను. నా సహజసిద్ధమైన ఆటపైనే నాకు నమ్మకం. నేను అవుట్ అయినందుకు కోపం రావడం వెనుక కారణం జట్టు పట్ల నా బాధ్యతే. నేను క్రీజులో మరికొంత సమయం ఉండి ఉంటే మరో 10-20 పరుగులు వచ్చి ఉండేవి. మేము లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు, నేను ఉండి ఉంటే మరో రెండు ఓవర్ల ముందే మ్యాచ్ ముగిసిపోయేది. అనవసరమైన షాట్ ఆడి అవుట్ అవ్వడం వల్ల జట్టుకు నష్టం జరుగుతుందేమో అన్న బాధ వల్లే నాకు అంత కోపం వచ్చింది.” అని వైభవ్ వివరించాడు.
యశస్విని వెనక్కి నెట్టి.. ఆరెంజ్ క్యాప్ కైవసం!
ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో తన ఓపెనింగ్ పార్ట్నర్ యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టి వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచుల్లో 200 పరుగులు చేసిన ఈ కుర్రాడి దూకుడు చూస్తుంటే, ఈ సీజన్లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
విరాట్ కోహ్లీ వంటి లెజెండ్ క్యాచ్ పట్టినా, రికార్డు సెంచరీ మిస్సయినా.. తన వ్యక్తిగత స్కోరు కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్న వైభవ్ పరిణతిని చూసి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
