టెహ్రాన్/వాషింగ్టన్: ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ వేసిన ఎత్తుగడ ఇప్పుడు ఆ దేశానికే శాపంగా మారింది. శత్రు దేశాల నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ సైన్యం సముద్ర గర్భంలో పరిచిన వేలాది ‘మందుపాతరలు’ (Sea Mines) ఇప్పుడు ఆ దేశానికి నియంత్రణ తప్పాయి. పక్కా ప్రణాళిక లేకుండా, అత్యవసరంగా వేసిన ఈ మైన్ల వల వల్ల.. యుద్ధం ఆగిపోయినా జలసంధిని పూర్తిగా తెరవలేక ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఈ వ్యూహాత్మక తప్పిదం వెనుక ఉన్న దిగ్భ్రాంతికర వివరాలు ఇవే:
- మ్యాప్ లేని మైన్లు: ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం.. గత మార్చిలో యుద్ధం గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు, ఇరాన్ తన చిన్న తరహా పడవల ద్వారా హోర్ముజ్ జలసంధి అంతటా వేలాది మందుపాతరలను పరిచింది. అయితే, వీటిని ఎక్కడ వేశారనే దానికి సంబంధించిన ఖచ్చితమైన ‘మిలిటరీ మ్యాప్’ ఇరాన్ దగ్గర లేదు. ఇప్పుడు ఆ మందుపాతరలను వెతకడం సముద్రంలో సూదిని వెతకడంలా మారింది.
- కొట్టుకుపోయిన మందుపాతరలు: పర్షియన్ గల్ఫ్‌లో సముద్రపు నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. దీనివల్ల ఇరాన్ వేసిన మైన్లు అవి ఉన్న చోటు నుండి మైళ్ల దూరం కొట్టుకుపోయాయి. వీటిని గుర్తించి తొలగించే అత్యాధునిక సాంకేతికత (సోనార్ మరియు అండర్ వాటర్ రోబోలు) ఇరాన్ వద్ద తగినంతగా లేదు.
- 1000 నౌకల నిరీక్షణ: ఈ మైన్ల భయం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద దాదాపు 1000కి పైగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20 నుండి 30 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఈ అడ్డంకి వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేకుండా పోయింది.
- కొత్త ‘టోల్’ ఎత్తుగడ: ప్రధాన మార్గాల్లో మైన్ల ప్రమాదం ఉండటంతో, ఇరాన్ ‘లారక్ ద్వీపం’ మీదుగా ఒక ఇరుకైన సురక్షిత మార్గాన్ని ప్రకటించింది. అయితే, ఈ మార్గంలో వెళ్లే నౌకలు తమ సైన్యం పర్యవేక్షణలోనే వెళ్లాలని, అందుకు భారీగా సుంకం (Toll) చెల్లించాలని ఇరాన్ నిబంధన పెట్టింది. దీనిపైనే ఇప్పుడు అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
- పర్యావరణ విధ్వంసానికి ఛాన్స్: ఒకవేళ ఏదైనా భారీ చమురు ట్యాంకర్ ఈ మైన్లను ఢీకొంటే, లక్షలాది టన్నుల ముడి చమురు సముద్రంలో కలిసిపోతుంది. ఇది సముద్ర జీవజాలానికే కాకుండా, ఆ ప్రాంతంలోని పగడపు దీవులకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. దీనిని శుభ్రం చేయడానికి దశాబ్దాల కాలం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ.. “సాంకేతిక కారణాల వల్ల జలసంధిని తెరవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇరాన్ తవ్విన గోతిలో ఇరానే పడ్డట్టు కనిపిస్తోంది. దీనివల్ల భారత్ వంటి ఆసియా దేశాలకు చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది.
