మాస్కో/టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమై, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు నేరుగా ఫోన్ చేసిన పుతిన్.. తాజా పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో పుతిన్ వేసిన అడుగు వెనుక ఉన్న కీలక అంశాలు ఇవే:
- మధ్యవర్తిత్వానికి పుతిన్ సై: ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు సాగిన చర్చలు విఫలమైన కొన్ని గంటల్లోనే పుతిన్ రంగంలోకి దిగారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడానికి, ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి రష్యా సిద్ధంగా ఉందని పెజెష్కియాన్‌కు పుతిన్ హామీ ఇచ్చారు. రాజకీయ మరియు దౌత్యపరమైన మార్గాల ద్వారానే ఈ సంక్షోభానికి పరిష్కారం కనుగొనాలని రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
- ట్రంప్ హెచ్చరికలకు కౌంటర్?: ఒకవైపు హోర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతుంటే, మరోవైపు పుతిన్ ఇరాన్‌కు మద్దతుగా నిలవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్న పుతిన్, ఇప్పుడు మధ్యప్రాచ్య వ్యవహారాల్లో తలదూర్చడం ద్వారా అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసిరినట్లయింది.
- డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్: ఇరాన్‌కు రష్యా, చైనాలు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని అమెరికా అనుమానిస్తోంది. ఇదే తరుణంలో చైనాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. “ఇరాన్‌కు ఆయుధాలు అందిస్తూ చైనా పట్టుబడితే, ఆ దేశం నుండి వచ్చే దిగుమతులపై 50 శాతం పన్ను విధిస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు. వచ్చే వారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యేందుకు ట్రంప్ బీజింగ్ వెళ్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
- యుద్ధం ముదురుతుందా.. శాంతి వస్తుందా?: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఇరాన్ వ్యవహారంలో పుతిన్ మధ్యవర్తిత్వం చేస్తాననడం అమెరికాకు మింగుడుపడటం లేదు. ఒకవేళ అమెరికా ప్రతిపాదనలను కాదని రష్యా వైపు ఇరాన్ మొగ్గితే, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా ఆంక్షలు, చైనాపై పన్నుల హెచ్చరికలు, రష్యా మధ్యవర్తిత్వ ప్రతిపాదనలు.. వెరసి హోర్ముజ్ జలసంధి వేదికగా ఒక భారీ అంతర్జాతీయ రాజకీయ చదరంగం మొదలైంది. మరి ఈ పోరులో గెలిచేదెవరో చూడాలి!
