ఎమ్మెల్యే సాహసమా? రాజకీయ స్టంట్లా? చిరుతను కర్రతో కొట్టిన చంద్రకాంత్ పాటిల్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న ముక్తాయీనగర్ ఎమ్మెల్యే!

జల్గావ్:మహారాష్ట్రలోని  జల్గావ్ జిల్లాలోని ముక్తాయీనగర్ బస్టాండ్ పరిసరాల్లో ఒక చిరుతపులి హల్‌చల్ సృష్టించింది. భయాందోళనలో ఉన్న ప్రజలను రక్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే.. అటవీశాఖ అధికారుల పనిలో తలదూర్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, కొత్త వివాదానికి తెరలేపారు. ఏక్ నాథ్ షిండే శివసేన వర్గానికి చెందిన ఎమ్మెల్యే చంద్రకాంత్ పాటిల్ చేసిన ఈ ‘స్టంట్’ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?

ముక్తాయీనగర్ బస్టాండ్ వద్ద చిరుతపులి కనిపించడంతో స్థానిక యంత్రాంగం, అటవీశాఖ బృందం రంగంలోకి దిగాయి. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు. అయితే, అనూహ్యంగా చిరుత బోను నుండి తప్పించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే చంద్రకాంత్ పాటిల్, స్వయంగా రంగంలోకి దిగారు.

చిరుతపులికి మత్తు మందు ఇంజెక్షన్ (Dart) ఇచ్చిన కొద్దిసేపటికే, అది తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పాటిల్ తన చేతిలోని కర్రతో చిరుతను బలంగా కొట్టారు. వెంటనే చిరుత ఆయనపై ఎదురుదాడికి దిగింది. ఈ పెనుగులాటలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఖడ్సే ఫైర్.. ఎమ్మెల్యే కౌంటర్!

ఈ ఘటనపై సీనియర్ నేత ఏక్ నాథ్ ఖడ్సే తీవ్రంగా స్పందించారు. “మత్తు మందు ఇచ్చిన జంతువును కర్రతో కొట్టడం చట్టరీత్యా నేరం. ఇది నిబంధనలకు విరుద్ధం, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి” అని డిమాండ్ చేశారు.

దీనిపై ఎమ్మెల్యే చంద్రకాంత్ పాటిల్ ధీటుగా స్పందిస్తూ.. “ఆ చిరుతపులి ఒక వ్యక్తిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. వారిని రక్షించేందుకే నేను కర్రతో కొట్టాను. నా సాహసాన్ని అభినందించాల్సింది పోయి, ఖడ్సే విమర్శలు చేయడం ఆయన రాజకీయ వికృతత్వానికి నిదర్శనం. ఇది కేవలం ఆయన కడుపుమంట రాజకీయమే” అని మండిపడ్డారు.

స్టంట్బాజీ అంటే ఇదేనా?

అటవీశాఖ నిపుణులు ఉండగా, ఎమ్మెల్యే ఇలాంటి సాహసాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చిరుతపులి తీవ్రంగా దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. రాజకీయ మైలేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ‘స్టంట్లు’ చేయడం అవసరమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం చిరుతను అధికారులు సురక్షితంగా బంధించినప్పటికీ, ఎమ్మెల్యే మరియు ఖడ్సే మధ్య మొదలైన ఈ ‘కర్ర’ యుద్ధం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.


Posted

in

by

Tags: