బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టి సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. భారతీయ సంగీత దిగ్గజం ఆశా భోస్లే మరణం సందర్భంగా ఆమెకు నివాళులర్పించబోయి అతియా చేసిన ఒక ఘోర తప్పిదం (Blunder) ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఆశా తాయికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. ఆమె ఫోటోకు బదులుగా నాలుగేళ్ల క్రితమే మరణించిన ఆమె సోదరి లతా మంగేష్కర్ ఫోటోను షేర్ చేయడమే ఈ వివాదానికి కారణమైంది.
ఏమిటా పొరపాటు?
ఏప్రిల్ 12న ఆశా భోస్లే మరణవార్త తెలియగానే దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అతియా శెట్టి కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆశా భోస్లేకు నివాళులర్పించింది. అయితే, ఆ పోస్ట్‌లో ఆశా భోస్లే ఫోటో బదులు, 2022లో కన్నుమూసిన లతా మంగేష్కర్ ఫోటోను ఉంచింది. తన పొరపాటును గ్రహించి వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే నెటిజన్లు దానిని స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.
నెటిజన్ల ఏకిపారేత.. ‘బ్రెయిన్ లెస్’ అంటూ విమర్శలు
ఈ ఘటనపై ‘X’ (ట్విట్టర్) వేదికగా నెటిజన్లు అతియాను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.
- “ఎవరైనా ఆమెకు చెప్పండి.. చనిపోయింది ఆశా భోస్లే అని, లతాజీ ఎప్పుడో మరణించారని” అంటూ ఒక నెటిజన్ మండిపడ్డాడు.
- “అతియా శెట్టి అందంగా ఉండవచ్చు కానీ, ఆమెకు కనీస జ్ఞానం లేదు. ఎలాంటి కష్టం లేకుండా వచ్చే ‘నెపో కిడ్స్’ ఇలాగే ఉంటారు. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి” అని మరో యూజర్ ఘాటుగా విమర్శించారు.
- “సొంత దేశపు లెజెండరీ సింగర్స్ మధ్య తేడా తెలియకపోవడం నిజంగా సిగ్గుచేటు” అంటూ మరికొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు.
ఆశా భోస్లే మరణానికి కారణం ఏంటి?
ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి వైద్యులు ఆశా భోస్లే మరణంపై స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 11న ఆమె ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స పొందుతూ ఏప్రిల్ 12 ఉదయం ‘మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్’ (అనేక అవయవాలు పని చేయకపోవడం) కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
భారతదేశం ఒక గొప్ప గాయనిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే, ఒక బాధ్యతాయుతమైన సెలబ్రిటీ హోదాలో ఉండి అతియా శెట్టి ఇలాంటి ‘బ్లండర్’ చేయడం అక్షమ్యమని సంగీత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
