తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణం తారాస్థాయికి చేరింది. ఐదు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా.. నేతల మధ్య వ్యక్తిగత విమర్శలు పరాకాష్టకు చేరుతున్నాయి. తాజాగా పీఎంకే అధినేత రామదాస్తో కలిసి కూటమి కట్టిన శశికళ, విరుదునగర్ జిల్లా రాజపాళయంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే అగ్రనేత ఎడపాడి పళనిస్వామి (EPS)పై విరుచుకుపడ్డారు. పదవి ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞత లేని వ్యక్తి అంటూ ఆయనపై విమర్శల దాడి చేశారు.
ఉదయనిధి చూపిస్తున్నది వాస్తవమే!
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తన ప్రచారంలో ఒక ఫోటోను చూపిస్తూ.. “ముఖ్యమంత్రి పదవి కోసం ఒకరు కాళ్ల మీద ఎలా పడుకున్నారో చూడండి” అంటూ ఎడపాడి పళనిస్వామిని ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై శశికళ స్పందిస్తూ.. “ఉదయనిధి చిన్న కుర్రాడే కావచ్చు, కానీ ఆయన చూపిస్తున్న ఆ ఫోటోలో ఉన్నది నిజమే కదా! టీవీల్లో అందరూ చూసిన దృశ్యాన్నే ఆయన చూపిస్తున్నారు. అందులో తప్పేముంది?” అని ప్రశ్నించారు.
“బిస్కెట్ వేసిన కుక్కకున్న కృతజ్ఞత కూడా లేదు”
ఎడపాడి పళనిస్వామిని ఉద్దేశించి శశికళ అత్యంత ఘాటుగా విమర్శలు గుప్పించారు:
“మీకు పదవి ఇచ్చిన వారి పట్ల మీరు కృతజ్ఞతతో ఉండి ఉండాల్సింది. ఇంట్లో పెంచుకునే చిన్న కుక్క పిల్లకైనా ఒక బిస్కెట్ వేస్తే అది ఎంతో విశ్వాసంగా ఉంటుంది. కానీ మీకు ఆ విశ్వాసం కూడా లేదు. ఉదయనిధిని నోటికొచ్చినట్లు విమర్శించడం మానేసి.. మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సింది.”
ఇదేం రాజకీయం?
ఒకరిపై ఒకరు వ్యక్తిగత దాడులు చేసుకోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. “ఉదయనిధి ఆ ఫోటో చూపిస్తే.. దానికి బదులుగా ఎడపాడి ‘నీవు ఫినాయిల్ తాగి పడుకున్నావు’ అంటూ విమర్శిస్తున్నారు. ఇవేనా ప్రజలకు కావలసిన మాటలు? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాగేనా మాట్లాడేది?” అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత నేతలకు అసలు పాలన ఎలా చేయాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ పార్టీ (TVK), సీమాన్ పార్టీ (NTK) మరియు రామదాస్-శశికళ కూటమి మధ్య సాగుతున్న ఈ పోరులో ఈ తరహా వ్యక్తిగత దూషణలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
