వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు అంటుకున్నాయి. ఇరాన్ చుట్టూ అమెరికా నౌకాదళం ‘మృత్యు వలయాన్ని’ బిగించింది. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం (Naval Blockade) సోమవారం నుండి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే ఏ నౌకనైనా అడ్డుకుని, స్వాధీనం చేసుకోవాలని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్: ‘క్విక్ అండ్ బ్రూటల్’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌పై నిప్పులు చెరిగారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే దాదాపు కుప్పకూలిందని ఆయన వ్యాఖ్యానించారు.
- ముగిసిన ఇరాన్ నౌకాదళం: ఇరాన్‌కు చెందిన 158 నౌకలు ఇప్పటికే సముద్ర గర్భంలో కలిసిపోయాయని, ఆ దేశ ప్రధాన నౌకాదళం అంతమైందని ట్రంప్ పేర్కొన్నారు.
- ‘ఫాస్ట్ అటాక్’ షిప్‌లకు వార్నింగ్: “ఇప్పటివరకు మేము ఇరాన్ చిన్న అటాక్ బోట్లను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హెచ్చరిస్తున్నాను.. మా దిగ్బంధనం సమీపంలోకి ఏ ఒక్క ఇరాన్ నౌక వచ్చినా, వాటిని తక్షణమే మట్టుబెడతాం (ELIMINATED). వీటిని తుడిచిపెట్టడానికి ‘కిల్లింగ్ సిస్టమ్’ను ఉపయోగిస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు.
- డ్రగ్ డీలర్ల తరహాలోనే శిక్ష: సముద్ర మార్గంలో డ్రగ్స్ రవాణా చేసే వారిని ఎంత వేగంగా, క్రూరంగా (Quick and Brutal) అణచివేస్తామో, ఇరాన్ నౌకల విషయంలోనూ అదే పంథా అనుసరిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఏ ఓడరేవూ సురక్షితం కాదు: ఇరాన్ ప్రతిఘటన
అమెరికా దూకుడుపై ఇరాన్ సైతం దీటుగానే స్పందించింది. తమపై దిగ్బంధనం విధిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
- భద్రతకు ముప్పు: అమెరికా గనుక తన మొండి వైఖరిని కొనసాగిస్తే.. గల్ఫ్ దేశాల్లోని ఏ ఒక్క ఓడరేవూ సురక్షితంగా ఉండబోదని ఇరాన్ మిలిటరీ ప్రకటించింది.
- ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే యుద్ధమే: ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవాలని చూస్తే, గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాల రేవులతో పాటు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. తమ సముద్ర సరిహద్దులను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధమని పేర్కొంది.
హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్
దిగ్బంధనం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా నిన్న ఒక్కరోజే 34 నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయని, ఇది రికార్డు అని ట్రంప్ తెలిపారు. అయితే, అమెరికా యుద్ధనౌకల పహారా మధ్య ఈ రాకపోకలు సాగడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో యుద్ధం గనుక మొదలైతే, చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
