ముంబై/పుణే: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో మహిళా ఉద్యోగుల భద్రత మరియు మతపరమైన వేధింపుల అంశం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కార్చిచ్చు రేపుతోంది. నాసిక్ టీసీఎస్ (TCS) లో చోటుచేసుకున్న విస్తుపోయే పరిణామాల వేడి చల్లారక ముందే, ఇప్పుడు పుణేలోని ఇన్ఫోసిస్ (Infosys BPM) లోనూ “జిహాదీ వేధింపులు” జరుగుతున్నాయంటూ ఒక సోషల్ మీడియా ఫిర్యాదు కలకలం రేపింది.
ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు.. మంత్రి రియాక్షన్!
సోమవారం ఒక ఎక్స్ (ట్విట్టర్) యూజర్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరియు మంత్రి నితీష్ రాణేలను ట్యాగ్ చేస్తూ ఒక సంచలన పోస్ట్ చేశారు. “పుణే ఇన్ఫోసిస్‌లోని ‘డైమ్లర్ ప్రాజెక్ట్’లో పనిచేస్తున్న పలువురు యువతులు జిహాదీ వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. దయచేసి దీనిపై విచారణ జరిపించండి” అని కోరారు. దీనిపై మంత్రి నితీష్ రాణే వెంటనే స్పందిస్తూ.. “నోటెడ్” (పరిశీలిస్తాం) అని సమాధానమిచ్చారు.
టీసీఎస్ నాసిక్‌లో అసలేం జరిగింది?
నాసిక్ టీసీఎస్ బిపిఓలో పనిచేస్తున్న ఎనిమిది మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి చేసిన ఫిర్యాదులు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి. వారి ఆరోపణల ప్రకారం:
- మతమార్పిడి ఒత్తిడి: ఉద్యోగులను నమాజ్ చదవాలని, గొడ్డు మాంసం (Beef) తినాలని బలవంతం చేయడం.
- లైంగిక వేధింపులు: మహిళా ఉద్యోగులను ప్రేమ పేరుతో వంచించి, ఆపై లైంగికంగా వేధించడం.
- మాస్టర్ మైండ్ నిదా ఖాన్: ఈ వ్యవహారం వెనుక నిదా ఖాన్ అనే వ్యక్తి సూత్రధారిగా ఉన్నట్లు నాసిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ (SIT) ప్రాథమిక విచారణలో తేల్చింది. ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
‘కార్పొరేట్ జిహాద్’ పై నితీష్ రాణే ఆగ్రహం
ఈ ఉదంతాన్ని మంత్రి నితీష్ రాణే “కార్పొరేట్ జిహాద్” గా అభివర్ణించారు. కంపెనీల్లో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే హ్యూమన్ రిసోర్స్ (HR) విభాగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. సుమారు 15 మంది బాధితులు ఇప్పటివరకు తమను సంప్రదించారని, ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు రావాలని, ప్రభుత్వం వారికి పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
టాటా సన్స్ సీరియస్.. విచారణకు ఆదేశం
ఈ ఆరోపణలు టాటా గ్రూప్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటంతో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాసిక్ టీసీఎస్ ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రమణియన్‌ను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఐటీ హబ్‌లుగా పేరుగాంచిన పుణే, నాసిక్ నగరాల్లోని అంతర్జాతీయ కంపెనీల్లో ఇలాంటి మతపరమైన మరియు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇప్పుడు సామాన్య ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.
