న్యూఢిల్లీ: పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలు, లక్షల్లో జీతాలు.. బయట ప్రపంచానికి ఐటీ ఉద్యోగం అంటే ఒక లగ్జరీ. కానీ, ఆ రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణాన్ని ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ బయటపెట్టారు. 2025లో తనకు లభించిన జీతం పెంపును చూసి సదరు ఇంజనీర్ షాక్‌కు గురయ్యారు. ఏకంగా 9 రూపాయల వేతనాన్ని పెంచుతూ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది.
రెడ్డిట్‌లో వెల్లువెత్తిన ఆవేదన: “ఈ కంపెనీ, ఇక్కడి సహోద్యోగులతో నా వల్ల కావడం లేదు” అనే శీర్షికతో సదరు టెక్కీ రెడ్డిట్ (Reddit) వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. వారంతాల్లో కూడా విశ్రాంతి లేకుండా ‘బానిసలా’ పనిచేస్తున్నా.. తగిన గుర్తింపు కానీ, వేతనం కానీ లభించడం లేదని ఆరోపించారు. ఒక విషవలయంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నానని, అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
9 రూపాయల ‘హైక్’ – విచిత్రమైన నిబంధనలు:
- తక్కువ జీతం: మే 2024లో ఒక ప్రముఖ ఎంఎన్‌సీలో ఇంటర్న్‌గా చేరి, ఆపై పర్మనెంట్ ఉద్యోగిగా మారారు. ఏడాదికి రూ. 4.25 లక్షల ప్యాకేజీతో చేరినా, చేతికి వచ్చే జీతం మాత్రం చాలా తక్కువ.
- హేళన చేసే పెంపు: మొదటి ఏడాది కేవలం 9 రూపాయలు మాత్రమే పెంచారని, ఈ ఏడాది అయితే ఆ 9 రూపాయలు కూడా పెంచే ‘తలనొప్పి’ కంపెనీ తీసుకోలేదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
- బానిస సంకెళ్లు: కంపెనీలో 2 ఏళ్ల బాండ్ అగ్రిమెంట్ ఉంది. ఒకవేళ మధ్యలోనే మానేస్తే రూ. 1.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
- కఠినమైన నోటీస్ పీరియడ్: ఇక్కడ ఉద్యోగం వదలాలంటే ఏకంగా 6 నెలల నోటీస్ పీరియడ్ ఉండాలి. దీనివల్ల వేరే ఉద్యోగం వెతుక్కోవడం అసాధ్యంగా మారిందని ఆయన వాపోయారు.
ఖర్చులన్నీ ఉద్యోగివే! ఆఫీసు పనుల కోసం క్లయింట్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, కానీ ఆ ప్రయాణ ఖర్చులను కంపెనీ రీయింబర్స్ చేయడం లేదని బాధితుడు తెలిపారు. పైగా ఆఫీస్ షటిల్ సర్వీస్ వాడినందుకు వేల రూపాయలను జీతం నుండి కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీకెండ్‌లో పనిచేసినందుకు ఇతర రోజుల్లో సెలవు ఇస్తున్నా, అది ఏమాత్రం ఊరటనివ్వడం లేదన్నారు.
కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోగా, కనీస గౌరవం కూడా లేని చోట పనిచేయలేక ఆ టెక్కీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
