ముంబై: బాలీవుడ్ సంచలన దర్శకుడు విక్రమ్ భట్ జీవితం ఒక సినిమాను తలపించేలా మలుపులు తిరుగుతోంది. రూ. 30 కోట్ల మోసం కేసులో అరెస్టు కావడం నుంచి, జైలులో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కోవడం వరకు ఆయన పడ్డ వేదనను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాజస్థాన్ పోలీసుల కస్టడీలో ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలులో గడిపిన ఆ కరాళ రాత్రులను గుర్తు చేసుకుంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
జైలు గదిలో ప్రాణసంకటం:
2025 డిసెంబర్లో అరెస్ట్ అయిన విక్రమ్ భట్, జనవరి నెలలో రాజస్థాన్‌ను వణికిస్తున్న గడ్డకట్టే చలిలో ఉదయ్‌పూర్ జైలులోని 10వ నంబర్ బ్యారక్‌లో ఉన్నారు. ఒక రాత్రి ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. “నాలుగు దుప్పట్లు కప్పుకున్నా వణుకు తగ్గలేదు. తోటి ఖైదీలు అదనపు దుప్పట్లు ఇచ్చి పారాసిటమాల్ వేసుకోమన్నారు. కానీ నా జ్వరం తగ్గలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యం అందక నరకయాతన:
మరుసటి రోజు జైలు ఆసుపత్రికి వెళ్తే అక్కడ కనీసం ‘థర్మామీటర్’ కూడా లేదని విక్రమ్ భట్ వెల్లడించారు. “నాకు ఆటో ఇమ్యూన్ సమస్య (Axial Spondyloarthritis) ఉంది. అటువంటి స్థితిలో జ్వరం వస్తే ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్ నన్ను బయట హాస్పిటల్‌కు తీసుకెళ్లమని నోట్ రాసినా, పోలీసులు మాత్రం రాలేదు. ఒకసారి వి.ఐ.పి బందోబస్తు అని, మరోసారి గిరిజన మేళా అని సాకులు చెబుతూ నన్ను గాలికి వదిలేశారు” అంటూ జైలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
అమ్మవారే ప్రాణం పోశారు:
మందులు పని చేయని చోట, మనుషులు సహకరించని చోట విక్రమ్ భట్‌ను దైవ చింతనే కాపాడిందట. జైలు బ్యారక్‌లో ఉన్న ఒక పెద్ద ‘దేవి’ (అమ్మవారి) పటాన్ని చూస్తూ ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు.
“తల్లీ! నువ్వే గనుక ఉంటే.. ఒక అద్భుతం చేసి చూపించు. నేను ఇక్కడ చావాలని అనుకోవడం లేదు. నా భార్యాబిల్లలకు, నా 90 ఏళ్ల వృద్ధుడైన తండ్రికి నేను కావాలి” అని కన్నీళ్లతో వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
అదే సమయంలో ఆహారంలో ఉప్పు, నూనె మానేసి కేవలం నీళ్లతోనే గడిపారు. చిత్రంగా కొద్ది రోజుల్లోనే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. 15 రోజుల తర్వాత పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు, ఆయన అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుని బయటపడ్డారు.
దేవుడు లేదనే వారికి విక్రమ్ భట్ ఇచ్చే సమాధానం:
“దేవుడు లేడని ఎవరైనా అంటే నేను వాదించను.. కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకుంటాను. ఎందుకంటే, కొన్ని అద్భుతాలు ఎవరికి అవసరమో వారికే కనిపిస్తాయి” అంటూ తన అనుభవాన్ని విక్రమ్ భట్ ముగించారు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న విక్రమ్ భట్, జైలులో తనకు ఎదురైన ఈ చేదు అనుభవం ద్వారా జీవితం గురించి ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నానని చెబుతున్నారు.
