పిల్లలకు ‘సోషల్’ షాక్? భారత్‌లో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్! భారీగా మద్దతు తెలుపుతున్న తల్లిదండ్రులు.

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ చేతిలోకి రాగానే లోకాన్నే మర్చిపోతున్న నేటి తరం పిల్లలకు సోషల్ మీడియా సెగ తగలనుందా? భారత్‌లో 16 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ ‘వర్కీ ఫౌండేషన్’ (Varkey Foundation) తాజాగా విడుదల చేసిన గ్లోబల్ రీసెర్చ్ నివేదికలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

మలేషియా తర్వాత భారత్‌లోనే అత్యధిక మద్దతు

సోషల్ మీడియా నిషేధాన్ని కోరుకుంటున్న దేశాల్లో భారత్ 75 శాతం మద్దతుతో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మలేషియా (77 శాతం) ఉండగా.. ఇటీవలే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఆస్ట్రేలియాలో 66 శాతం మంది తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

నివేదికలోని ఆసక్తికర అంశాలు:
  • తల్లిదండ్రుల ఆందోళన: డిజిటల్ యుగంలో కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని, పిల్లల విలువలు మారుతున్నాయని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • యువత సైతం సై: ఆశ్చర్యకరంగా, సోషల్ మీడియాలోనే పుట్టి పెరిగిన ‘జెన్ జీ’ (Gen Z) యువత కూడా భారత్‌లో ఈ నిషేధానికి 73 శాతం మద్దతు తెలపడం విశేషం. ఇది ప్రపంచ సగటు (51 శాతం) కంటే చాలా ఎక్కువ.
  • జపాన్ భిన్నం: జపాన్‌లో కేవలం 38 శాతం మంది మాత్రమే ఈ నిషేధాన్ని సమర్థిస్తుండగా, నైజీరియా (39%), అమెరికా (51%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
భారతీయ పిల్లల ఆలోచనా విధానం వేరు!

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తుండగా (కేవలం 37 శాతం మద్దతు), భారత్ మరియు మలేషియాలోని 18 ఏళ్లలోపు పిల్లలు మాత్రం 62 శాతం మంది తమకు సోషల్ మీడియా వద్దని చెప్పడం గమనార్హం. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది.

ఎందుకు ఈ చర్చ?

వర్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ మాట్లాడుతూ.. “ఈ పరిశోధన కేవలం నిషేధం గురించి మాత్రమే కాదు, సాంకేతికత కుటుంబ బంధాలను ఎలా ప్రభావితం చేస్తోంది అనే దానిపై చర్చ మొదలుపెట్టడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో 15 దేశాల్లో సుమారు 18,000 మందిపై జరిపిన ఈ సర్వే ప్రస్తుత డిజిటల్ ప్రపంచంపై ప్రజల అసహనాన్ని ప్రతిబింబిస్తోంది.


Posted

in

by

Tags: