లీటర్ నూనె ఎన్ని రోజులు రావాలి? నెలకు ఒకరు ఎంత నూనె వాడితే క్షేమం? గుండె ఆరోగ్యంపై డాక్టర్ల కీలక హెచ్చరిక!

హెల్త్ డెస్క్: మీకు స్పైసీ ఫుడ్స్, నూనెలో వేయించిన పదార్థాలు ఇష్టమా? మాటిమాటికీ హోటల్ భోజనం లేదా జంక్ ఫుడ్ తింటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే! మనం రోజూ వాడే వంట నూనె మన ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ హెల్త్ నిపుణురాలు డాక్టర్ శ్వేత నాగర్, ఒక వ్యక్తి రోజుకు ఎంత నూనె వాడాలి? ఒక లీటర్ నూనె ఎన్ని రోజులు రావాలి? అనే అంశంపై దిశానిర్దేశం చేశారు.

ఒక్కొక్కరికి ఎంత నూనె అవసరం?

డాక్టర్ శ్వేత నాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. నూనె వినియోగం విషయంలో మనం అంచనా వేయకుండా వాడితే, అది ఖచ్చితంగా పరిమితిని మించిపోతుంది. దీని కోసం ఆమె ఒక సాధారణ గణితాన్ని సూచించారు:

  • రోజువారీ కోటా: ఒక వ్యక్తి రోజుకు కేవలం 15 నుండి 20 మి.లీ. నూనె లేదా నెయ్యి మాత్రమే తీసుకోవాలి.
  • నెలవారీ లెక్క: ఈ లెక్కన ఒక వ్యక్తికి నెలకు 500 నుండి 600 మి.లీ. అంటే కేవలం అర లీటర్ నూనె సరిపోతుంది.
  • కుటుంబం మొత్తానికి: మీ ఇంట్లో నలుగురు సభ్యులు ఉన్నట్లయితే, నెలకు 2 నుండి 2.5 లీటర్ల నూనె డబ్బా మాత్రమే ఖర్చు కావాలి. అంతకంటే ఎక్కువ వాడుతున్నారంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!
నూనె వాడే పద్ధతి మార్చుకోండి!

చాలామంది నూనె డబ్బాను నేరుగా బాండీలో వంచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంత నూనె పడుతుందో మనకు తెలియదు. అందుకే..

  1. స్పూన్ వాడండి: నూనెను నేరుగా పోయకుండా స్పూన్‌తో వేయడం అలవాటు చేసుకోండి.
  2. డైట్ ప్లాన్: ఉదయం టిఫిన్‌కు ఒక స్పూన్, మధ్యాహ్నం భోజనానికి ఒక స్పూన్, రాత్రికి ఒక స్పూన్ చొప్పున ఒక్కొక్కరికి కేటాయించండి.
  3. నెయ్యి వాడకం: వీలైతే రోజులో ఒక స్పూన్ నూనెకు బదులు నెయ్యి వాడండి. ఇది జీర్ణక్రియకు మరియు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అతిగా వాడితే గుండె ‘గోవిందా’!

నూనె అతిగా వాడటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి నేరుగా గుండె జబ్బులకు దారితీస్తుంది. ఒక పెద్ద టేబుల్ స్పూన్ నూనెలో సుమారు 120 క్యాలరీలు ఉంటాయి. నెయ్యి వాడటం మంచిదే అయినా, అది కూడా రోజుకు ఒకటి లేదా రెండు చిన్న స్పూన్లకు మించకూడదు.

ఫ్యాట్స్ పూర్తిగా మానేయకండి!

నూనె ప్రమాదకరం కదా అని కొవ్వు పదార్థాలను పూర్తిగా మానేయడం కూడా తప్పు. శరీరానికి విటమిన్ A, D, E మరియు K లు అందాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. కానీ “ఒక వ్యక్తికి అర లీటర్” అనే నిబంధనను మాత్రం కఠినంగా పాటించాలని డాక్టర్ నాగర్ సూచిస్తున్నారు.


Posted

in

by

Tags: