స్టాక్ మార్కెట్‌లో కాసులు కురిపించాలా? వారెన్ బఫెట్ చెప్పిన ఈ 9 ‘గోల్డెన్ రూల్స్’ పాటిస్తే మీరే ఇన్వెస్ట్‌మెంట్ కింగ్!

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి భయం.. మరికొందరికి అదొక జూదం. కానీ, కేవలం కొన్ని డాలర్లతో ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు 9 లక్షల కోట్ల రూపాయలకు పైగా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఒకే ఒక్కడు వారెన్ బఫెట్. ఇన్వెస్ట్‌మెంట్ ప్రపంచంలో ‘ఒమేహా మాంత్రికుడు’గా పిలవబడే బఫెట్, గత 55 ఏళ్లుగా సగటున 20% వార్షిక రిటర్న్స్‌తో ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఆయన సక్సెస్ వెనుక ఉన్న ఆ 9 రహస్యాలు ఏంటో తెలుసుకుంటే, మీరు కూడా మార్కెట్ రారాజు కావచ్చు!

  1. మీకు తెలిసిన వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టండి
    వారెన్ బఫెట్ చెప్పే మొదటి సూత్రం.. “మీకు అర్థం కాని వ్యాపారంలో పైసా కూడా పెట్టకండి.” ఏదో ట్రెండ్ నడుస్తోందని లేదా ఎవరో చెప్పారని క్రిప్టో కరెన్సీలనో, కొత్త టెక్నాలజీలనో నమ్మి మోసపోవద్దు. బఫెట్ స్వయంగా టెక్నాలజీ అర్థం కాక చాలా కాలం వరకు యాపిల్ కంపెనీలో పెట్టుబడి పెట్టలేదు. మీకు ఏ రంగంపై అవగాహన ఉందో అక్కడే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
  2. తెలివితేటల కంటే.. క్రమశిక్షణే ముఖ్యం!
    మార్కెట్‌లో గెలవడానికి మేధావి కావాల్సిన పనిలేదు, ఒక క్రమబద్ధమైన వ్యవస్థను (System) అనుసరిస్తే చాలు. అందుకే బఫెట్ సాధారణ పెట్టుబడిదారులకు ‘ఇండెక్స్ ఫండ్స్’ లేదా SIP మార్గాన్ని సూచిస్తారు. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే క్రమశిక్షణే మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తుంది.
  3. కంపెనీని ‘యజమాని’ కళ్లతో చూడండి
    మీరు ఒక షేరు కొంటున్నారంటే.. కేవలం స్క్రీన్ మీద కనిపించే నెంబర్లను కొనడం లేదు, ఒక నడుస్తున్న వ్యాపారంలో భాగస్వామి అవుతున్నారు. ఆ కంపెనీని మీరు సొంతంగా నడపగలరా? వచ్చే 20 ఏళ్ల పాటు ఆ కంపెనీ మార్కెట్‌లో ఉంటుందా? అని ఆలోచించండి. మీ సొంత దుకాణం కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో, షేర్లు కొనేటప్పుడు కూడా అలాగే ఉండాలి.
  4. అందరూ ఆశగా ఉన్నప్పుడు భయపడండి.. అందరూ భయపడేటప్పుడు ఆశగా ఉండండి!
    ఇది బఫెట్ చెప్పిన అత్యంత కీలకమైన మంత్రం. మార్కెట్ విపరీతంగా పెరుగుతున్నప్పుడు అందరూ లాభాల కోసం ఎగబడతారు, అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ కుప్పకూలి అందరూ భయంతో షేర్లు అమ్ముకుంటున్నప్పుడు, మంచి కంపెనీలు చౌకగా దొరుకుతాయి. అప్పుడే మీరు ధైర్యంగా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీ లాభాలు వస్తాయి.
  5. చేతిలో కొంత నగదు (Cash) ఉంచుకోండి
    “బంగారం కురుస్తున్నప్పుడు స్పూన్ పట్టుకోకూడదు.. బకెట్ పట్టుకోవాలి” అంటారు బఫెట్. అంటే, మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు మంచి షేర్లను భారీగా కొనడానికి మీ దగ్గర ఎప్పుడూ కొంత నగదు సిద్ధంగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని, సరైన అవకాశం కోసం వేచి చూడండి.
  6. ‘చౌక’గా వస్తుందని చెత్తను కొనకండి
    ధర తక్కువగా ఉందని నాసిరకం కంపెనీల జోలికి వెళ్లొద్దు. ఒక అద్భుతమైన కంపెనీని సరైన ధరకు కొనడం మేలు తప్ప.. ఒక మామూలు కంపెనీని చాలా తక్కువ ధరకు కొనడం వల్ల ప్రయోజనం ఉండదు. నాసిరకం వ్యాపారం ఎంత తక్కువకు దొరికినా, అది మీ సంపదను హరిస్తుందే తప్ప పెంచదు.
  7. కాలం (Time) మీ స్నేహితుడు.. చక్రవడ్డీ మీ ఆయుధం!
    ఇన్వెస్ట్‌మెంట్‌లో ‘కాంపౌండింగ్’ (చక్రవడ్డీ) శక్తే అసలైన బలం. దీనికి కావాల్సింది కాలం. బఫెట్ తన సంపదలో 90% పైగా 50 ఏళ్ల వయసు తర్వాతే సంపాదించారు. మంచి కంపెనీలను కొని దశాబ్దాల పాటు వదిలేయడమే సక్సెస్ సీక్రెట్. మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెడితే, కాలం మీకు అంతగా సహకరిస్తుంది.
  8. అప్పు చేసి షేర్లు కొనకండి
    ఉప్పు తిన్నమ్మ నీళ్లు తాగుతుంది.. అప్పు చేసి షేర్లు కొన్నవాడు నష్టపోతాడు! మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకవేళ మీరు అప్పు తెచ్చి పెడితే, మార్కెట్ పడిపోయినప్పుడు భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని సర్వం కోల్పోయే ప్రమాదం ఉంది.
  9. పెట్టుబడిని సరళంగా ఉంచండి
    పెట్టుబడిని మరీ క్లిష్టంగా మార్చుకోవద్దు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ వంటి సంక్లిష్టమైన ఆర్థిక పథకాలకు దూరంగా ఉండండి. బఫెట్ విజయం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే.. ఆయన ఎప్పుడూ సులభమైన, దీర్ఘకాలం మన్నే వ్యాపారాలనే ఎంచుకున్నారు.

Posted

in

by

Tags: