అమరావతి (మహారాష్ట్ర): అమరావతిని వణికిస్తున్న మైనర్ల లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోల కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. గురువారం ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేయడంతో, ఇప్పటివరకు పట్టుబడ్డ వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ విషయాన్ని అమరావతి (రూరల్) ఎస్పీ విశాల్ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
విస్తరిస్తున్న అరెస్టుల పర్వం
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయాన్ అహ్మద్ తన్వీర్ అహ్మద్ (19)తో పాటు, తాజాగా అరెస్ట్ అయిన వారిలో మహ్మద్ ఇమ్రాన్ (21), షేక్ నవేద్ (21), ఐఫాజ్ ఖాన్ (26), మానవ్ దీపక్ సుగంధే (20) తదితరులు ఉన్నారు. ఈ ముఠా అశ్లీల కంటెంట్‌ను ఒకరి నుండి ఒకరికి ఎలా షేర్ చేసుకున్నారనే ‘డిజిటల్ చైన్’ను పోలీసులు పాక్షికంగా ఛేదించారు. నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
గంటల లెక్కన అద్దెకు గది.. అక్కడే అఘాయిత్యాలు!
విచారణలో దిమ్మతిరిగే వాస్తవం వెలుగులోకి వచ్చింది. అయాన్ అహ్మద్ మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు తన స్నేహితుడు మానవ్ దీపక్ సుగంధే అద్దెకు తీసుకున్న గదిని ఉపయోగించుకున్నట్లు తేలింది. ఈ గదిని గంటల లెక్కన అద్దెకు తీసుకుని అరాచకాలు సాగించేవారు. ప్రస్తుతం పోలీసులు ఆ గదిని సీజ్ చేసి పంచనామా నిర్వహించారు. గది యజమానికి ఈ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
90 శాతం వేట సోషల్ మీడియాలోనే..
నిందితుడు అయాన్ గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అమ్మాయిలకు గాలం వేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. “బాధితులతో జరిగిన పరిచయాల్లో 90 శాతం సోషల్ మీడియా ద్వారానే జరిగాయి. నమ్మించి స్నేహం చేసి, ఆపై లైంగికంగా వాడుకుని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసేవాడు” అని ఎస్పీ వివరించారు. నిందితులు కొంత డేటాను డిలీట్ చేసినట్లు గుర్తించామని, వాటిని రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ టీమ్ ప్రయత్నిస్తోందని చెప్పారు.
బాధితుల సంఖ్యపై స్పష్టత
సోషల్ మీడియాలో బాధితుల సంఖ్య 180 వరకు ఉండొచ్చని వస్తున్న వార్తలపై ఎస్పీ స్పందించారు. “మేము కేవలం ధృవీకరించిన వాస్తవాలనే వెల్లడిస్తున్నాం. ప్రస్తుతానికి బాధితుల సంఖ్య ఎనిమిదిగా ఉంది. విచారణలో మరిన్ని ఆధారాలు దొరికితే ఆ వివరాలను కూడా పంచుకుంటాం. ఎవరినీ తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశ్యం మాకు లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసును డీల్ చేస్తోంది. మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనారిటీ కమిషన్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
