రసగుల్లా తిన్నాడని రాక్షసత్వం: బాలుడిని మండుతున్న తందూరీ పొయ్యిలో పడేసిన వంటవాడు!

బస్తీ: ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. పెళ్లి విందులో పదే పదే రసగుల్లాలు తిన్నాడన్న కోపంతో, ఒక వంటవాడు కనికరం లేకుండా 11 ఏళ్ల బాలుడిని మండుతున్న తందూరీ పొయ్యిలో పడేశాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతున్నాడు.

అసలేం జరిగిందంటే?
గతంలో తల్లిని కోల్పోయిన చమన్ (11) అనే బాలుడు, బస్తీ జిల్లాలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ రెండో తరగతి చదువుతున్నాడు. బుధవారం తన అమ్మమ్మతో కలిసి మలౌలీ గోసాయి గ్రామంలో జరుగుతున్న ఒక బంధువుల పెళ్లికి వెళ్లాడు. వేడుకలో సరదాగా గడిపిన బాలుడు, భోజనాల దగ్గరకు వెళ్ళి అక్కడి రసగుల్లాలు తింటున్నాడు. బాలుడు పదే పదే స్వీట్లు తీసుకోవడం చూసి అక్కడి క్యాటరింగ్ కాంట్రాక్టర్ సహనం కోల్పోయాడు.

పగ తీర్చుకున్న రాక్షసుడు
ఆరోపణల ప్రకారం.. మొదట బాలుడిని పట్టుకుని భయపెట్టిన కాంట్రాక్టర్, ఆగ్రహంతో ఆ చిన్నారిని అమాంతం ఎత్తి పక్కనే మండుతున్న వేడి వేడి తందూరీ పొయ్యి పైకి విసిరాడు. పట్టు తప్పిన బాలుడు నేరుగా మంటల్లో పడిపోయాడు. బాలుడి కేకలు విని అతిథులు పరుగున వచ్చి అతడిని బయటకు తీశారు. అప్పటికే ఆ చిన్నారి ముఖం నుండి నడుము వరకు శరీరం తీవ్రంగా కాలిపోయింది.

పరిస్థితి విషమం.. నిందితుడు పరారీ
తీవ్రంగా గాయపడిన చమన్‌ను వెంటనే అయోధ్య మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు అతడిని మెరుగైన చికిత్స కోసం లక్నో మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు ఘటన తర్వాత అక్కడి నుండి పరారయ్యాడు.

పోలీసుల వేట: కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక
ఘటనపై సమాచారం అందుకున్న చావనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మేనమామ దేవీదీన్ నిషాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. డీఎస్పీ స్వర్ణిమ సింగ్ మాట్లాడుతూ.. బాలుడిపై దాడికి పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

తల్లి లేని పిల్లాడు సరదాగా పెళ్లికి వెళ్తే, కేవలం ఒక మిఠాయి కోసం ఆ పసివాడి ప్రాణాల మీదకు తీసుకురావడం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: