టెక్సాస్/వాషింగ్టన్: దశాబ్దాల కాలం పాటు ఒక దేశాన్ని నమ్ముకుని, అక్కడి వ్యవస్థలో భాగమైన ఒక భారతీయ మహిళకు ఇప్పుడు అమెరికా గడ్డపై ఊహించని అవమానం ఎదురైంది. 35 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ, కోర్టులో అనువాదకురాలిగా సేవలందించిన 53 ఏళ్ల మీనూ బత్రాను అమెరికన్ ఇమ్మిగ్రేషన్ విభాగం (ICE) అదుపులోకి తీసుకుంది. విధి వైచిత్రం ఏమిటంటే, వేలాది మంది వలసదారులకు న్యాయశాస్త్ర చిక్కులను వివరించిన ఆమె, ఈరోజు అదే చట్టం కోరల్లో చిక్కుకుని దేశ బహిష్కరణ (Deportation) ముప్పును ఎదుర్కొంటున్నారు.
విమానాశ్రయంలో అరెస్ట్.. అమానవీయ ప్రవర్తన!
మార్చి 17న టెక్సాస్‌లోని వ్యాలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక కోర్టు అసైన్‌మెంట్ నిమిత్తం విస్కాన్సిన్ వెళ్తుండగా ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లాయర్లు దాఖలు చేసిన ‘హేబియస్ కార్పస్’ పిటిషన్ ప్రకారం.. ఆమె పట్ల అధికారులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు:
సుమారు 24 గంటల పాటు ఆమెకు కనీసం ఆహారం, మంచినీరు కూడా అందించలేదు.
2025 డిసెంబర్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న ఆమెకు కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదు.
ప్రస్తుతం ఆమె తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చట్టపరమైన చిక్కు ఏమిటి?
1980వ దశకంలో సిక్కు వ్యతిరేక అల్లర్ల నేపథ్యంలో మీనూ బత్రా అమెరికాకు వెళ్లారు. 2000వ సంవత్సరంలో ఆమెకు ‘విత్‌హోల్డింగ్ ఆఫ్ రిమూవల్’ హోదా లభించింది. అంటే, భారత్‌లో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఆమెను వెనక్కి పంపకూడదని అర్థం. అయితే, ఈ హోదా ఆమెకు శాశ్వత పౌరసత్వాన్ని (గ్రీన్ కార్డ్) ఇవ్వలేదు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన నిబంధనల వల్ల, పాత కేసులను తిరగదోడి ఆమెను భారత్ కాకుండా వేరే ఏదైనా మూడో దేశానికి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
దేశం కోసం కొడుకు.. కటకటాల వెనుక తల్లి!
మీనూ బత్రా నలుగురు పిల్లలకు ఒంటరి తల్లి. ఆమె పిల్లలందరూ అమెరికా పౌరులే. విశేషమేమిటంటే, ఆమె చిన్న కుమారుడు ప్రస్తుతం అమెరికా సైన్యం (US Army)లో పనిచేస్తూ దేశానికి సేవ చేస్తున్నాడు. తన తల్లిని పెరోల్‌పై విడుదల చేయాలని అతను అధికారులను కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. టెక్సాస్‌లో పంజాబీ, హిందీ, ఉర్దూ భాషల్లో ఏకైక సర్టిఫైడ్ మాస్టర్ లెవల్ ఇంటర్‌ప్రెటర్ (అనువాదకురాలు)గా ఆమెకు ఎంతో గౌరవం ఉంది.
కోర్టు ఆగ్రహం.. ఏప్రిల్ 21 వరకు గడువు
మీనూ బత్రా వద్ద మరో నాలుగేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉన్నప్పటికీ ఆమెను అరెస్ట్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టెక్సాస్ డిస్ట్రిక్ట్ కోర్టు.. అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి (DHS) నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 21, 2026 లోపు దీనిపై పూర్తి స్థాయి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ప్రస్తుతం మెక్సికో సరిహద్దులోని ఒక డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న మీనూ బత్రాకు తక్షణమే వైద్య సాయం అందించి, విడుదల చేయాలని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
