అమరావతి జిల్లా పరతవాడ నగరంలో సాగుతున్న ఒక భయంకరమైన సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చి పీడకలలా మారుతోంది. ప్రధాన నిందితుడు అయాన్ అహ్మద్ తన వలలో పడ్డ అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియో తీసి వికృతానందం పొందేవాడు. అయితే, ఒక చిన్న పొరపాటు అతడి పాపం పండేలా చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జరుపుతున్న విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. కేవలం అయాన్ మాత్రమే కాకుండా, ఈ వీడియోలను వైరల్ చేసిన స్నేహితులు, కాలేజీ విద్యార్థులు మరియు ఒక ఉపాధ్యాయుడు కూడా ఈ రాక్షస క్రీడలో భాగస్వాములవ్వడం పరిస్థితి తీవ్రతను చాటిచెబుతోంది.
పాన్ షాపు వద్ద దొరికిన ఫోన్.. గుట్టురట్టు!
అయాన్ అహ్మద్ తన మొబైల్ ఫోన్‌ను పొరపాటున ఒక పాన్ షాపు వద్ద మర్చిపోయాడు. అయాన్ ప్రాణ స్నేహితుడు ఉజేర్ ఖాన్‌కు ఆ ఫోన్ దొరికింది. ఫోన్ లాక్ కోడ్ తెలిసిన ఉజేర్, స్నాప్‌చాట్ ఓపెన్ చేయగా అందులో ఉన్న అమ్మాయిల నగ్న వీడియోలను చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన మొబైల్ లోకి ఆ వీడియోలను దొంగిలించి, మొహమ్మద్ సాద్ మరియు ఎహ్ఫాజ్ ఖాన్లకు పంపాడు. అయాన్ గతంలో తన ‘ఘనకార్యాల’ గురించి గొప్పగా చెప్పుకునేవాడు, కానీ ఈ వీడియోల ద్వారా ఆ దారుణాలు కళ్ల ముందు కనిపించాయి.
గురువే.. బురద చల్లాడు!
ఈ నీచమైన గొలుసుకట్టులో ఒక ఉపాధ్యాయుడి హస్తం ఉండటం గమనార్హం. పరతవాడలో ట్యూషన్ సెంటర్ నడుపుతున్న ఎహ్ఫాజ్ ఖాన్, తన క్లాసులో చదివే అమ్మాయిలెవరైనా ఆ వీడియోలో ఉన్నారా అని చూసే సాకుతో వాటిని వీక్షించి, ఇమ్రాన్ మరియు నావెద్ అనే వ్యక్తులకు ఫార్వర్డ్ చేశాడు. ఈ కేసులో మొత్తం ఆరుగురి ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు.
బెడ్రూంల అద్దె దందా.. గంటకు రూ.500!
కఠోరా నాకా ప్రాంతంలోని ఒక ఫ్లాట్ ఈ లైంగిక అరాచకాలకు అడ్డాగా మారింది. ఫ్లాట్ యజమాని మానవ్ సుగంధే, తనకు అద్దె భారం కాకుండా ఉండేందుకు ‘అద్దె ప్రాతిపదికన’ గంటల లెక్కన గదులను అమ్మాయిలు, అబ్బాయిలకు ఇవ్వడం మొదలుపెట్టాడు. పీయూష్ అనే స్నేహితుడి సలహాతో ఈ దందాలోకి దిగిన మానవ్, అయాన్ వంటి కామాంధులకు గంటకు 500 రూపాయలు తీసుకుని తన గదిని అప్పగించేవాడు. పోలీసులు ఇప్పటికే పలువురి మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
ఈ ఉదంతం తీవ్రతను గమనించిన జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ తీరును సమీక్షించింది. రాష్ట్ర మైనారిటీ కమిషన్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే పరతవాడను సందర్శించి వాస్తవాలను సేకరించాయి. నిందితులు డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
