తండ్రి స్టార్ హీరో అయితే పిల్లలు కూడా స్టార్స్ అవ్వడం, తండ్రి రాజకీయ నాయకుడైతే పిల్లలు కూడా రాజకీయాల్లోకి రావడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రాజ్యమేలుతున్న వారిలో చాలామంది అప్పటి స్టార్ నటుల వారసులే.
కానీ, దీనికి భిన్నంగా కొంతమంది తమ తల్లిదండ్రుల నీడలో కాకుండా, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకుండా తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని చూస్తారు. దానికి నిదర్శనమే అక్షయ్ కుమార్ కుమారుడు ఆరవ్.
ఆరవ్.. బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ మరియు ట్వింకిల్ ఖన్నా దంపతుల ముద్దుల కుమారుడు. తండ్రిలాగే మార్షల్ ఆర్ట్స్ (సమర కళలు)పై మక్కువ ఉన్న ఆరవ్, జపనీస్ మార్షల్ ఆర్ట్ ‘కుడో’ (Kudo)లో ‘ఫస్ట్ డిగ్రీ బ్లాక్ బెల్ట్’ సాధించాడు. ముంబైలోని ఎకోల్ మాండియల్ వరల్డ్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆరవ్, 15 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు.
ప్రస్తుతం ఆరవ్‌కు 23 ఏళ్లు. సాధారణంగా ఈ వయస్సులో స్టార్ కిడ్స్ సినిమా ఆఫర్ల కోసం కరణ్ జోహార్ వంటి ప్రముఖుల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఆరవ్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. సినిమాల్లోకి రావడానికి అతనికి ఎలాంటి ఆసక్తి లేదు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమారే పలు సందర్భాల్లో ధృవీకరించారు.
ఇటీవల శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ తన కుమారుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “నా కొడుకుకు సినిమాలపై ఆసక్తి లేదు, అతను చాలా సరళమైన జీవితాన్ని ఇష్టపడతాడు. ఇంట్లో డబ్బుకు కొరత లేకపోయినా, అతను ప్రస్తుతం కేవలం రూ. 4,500 జీతానికే పనిచేస్తున్నాడు” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
దీని గురించి అక్షయ్ గర్వంగా మాట్లాడుతూ.. “అందులో తప్పేమీ లేదు, అది మంచి విషయమే. అతను ప్రస్తుతం పల్లెటూళ్లకు వెళ్తూ అక్కడి సంప్రదాయాలు, ఆచారాలు మరియు ఫ్యాషన్ గురించి తెలుసుకుంటున్నాడు. రకరకాల దుస్తుల ప్రింట్లు, ఇతర వస్తువులపై అవగాహన పెంచుకుంటున్నాడు. జీవితంలో షార్ట్‌కట్‌లను అతను నమ్మడు. నాకు లాగే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఇష్టపడతాడు” అని తెలిపారు.
తన కుమారుడికి తాను ఎలాంటి సలహాలు, మార్గదర్శకత్వం ఇవ్వనని, ఎవరినీ బాధపెట్టవద్దు అని మాత్రమే చెబుతానని అక్షయ్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం అక్షయ్ కుమార్‌కు రూ. 2,700 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినప్పటికీ, తండ్రి సామ్రాజ్యంపై ఆధారపడకుండా తనదైన బాటను వెతుక్కుంటున్న ఆరవ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
