సుమారు 40 డిగ్రీల ఎండలో, నిర్మానుష్యమైన మిద్దెపై బట్టలు లేకుండా, కేవలం ఎముకల గూడులా పడి ఉన్న ఒక మహిళను అధికారులు రక్షించిన ఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. మృత్యువుతో పోరాడుతున్న ఆ మహిళ, అధికారులను చూడగానే అడిగిన మొదటి మాట: “ఆకలి వేస్తోంది.. అన్నం పెట్టండి”.
సీమా సోనీ (40) అనే మహిళ గత 4 నుండి 5 నెలలుగా తన ఇంటి మిద్దెపైనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నరకయాతన అనుభవిస్తోంది. దీని గురించి సమాచారం అందిన వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్ దీపికా నామ్ దేవ్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుష్పా సింగ్ మరియు న్యాయవాది మీను లాల్వానీ బృందం అక్కడికి చేరుకున్నారు.
అక్కడ వారు చూసిన దృశ్యం అధికారులనే దిగ్భ్రాంతికి గురిచేసింది. సరైన ఆహారం లేక, ఒక మురికి దుప్పటిని మాత్రమే కప్పుకుని, అస్థిపంజరంలా సీమా పడి ఉంది. నెలల తరబడి స్నానం లేక, సరైన సంరక్షణ లేక ఆమె అక్కడ దుర్భర స్థితిలో ఉంది. అధికారులు ఆమెను రక్షించి వెంటనే ఆహారం, నీరు అందించారు. ప్రస్తుతం ఆమె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రాజెక్ట్ ఆఫీసర్ దీపికా మాట్లాడుతూ.. “మాకు సమాచారం అందినప్పుడు మేము ఊహించిన దానికంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమె మాట్లాడుతోంది కానీ చాలా కాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెకు మెరుగైన చికిత్స అందించడమే మా ప్రథమ లక్ష్యం” అని తెలిపారు.
సీమా భర్త అజిత్ సోనీ స్పందిస్తూ.. “నా భార్యకు 2016 నుండి మానసిక అనారోగ్యం ఉంది. అహ్మదాబాద్, గ్వాలియర్‌లో చికిత్స చేయించాము. ఇంట్లో నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆమెను మిద్దెపై ఉంచాము. మేము ఆమెను సంరక్షిస్తున్నాము” అని చెప్పారు.
అయితే, భర్త మాటలను అధికారులు నమ్మడం లేదు. ఒక అనారోగ్యంతో ఉన్న మహిళను అంతటి మండుటెండలో, బట్టలు కూడా లేకుండా ఉంచడం తీవ్రమైన నేరమని అధికారులు భావిస్తున్నారు. ఇది ‘సంరక్షణ’ కాదు ‘క్రూరత్వం’ అని వారు మండిపడుతున్నారు. మనుషులు బతికుండగానే తోటి మనుషులు ఇలాంటి స్థితికి తీసుకురావడం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
