హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ దాడి: వెనుదిరిగిన 20 నౌకలు; చూస్తూ ఉండిపోయిన అమెరికా నేవీ!

ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో పరిస్థితులు మరోసారి వేగంగా దిగజారుతున్నాయి. శనివారం ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన రెండు భారతీయ నౌకలపై కాల్పులు జరగడంతో షిప్పింగ్ రంగంలో కలకలం రేగింది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరింది.

ఏం జరిగింది?
హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ దాడి జరిగింది. అంతకుముందు ఎనిమిది చమురు ట్యాంకర్ల కాన్వాయ్ ఈ మార్గం గుండా వెళ్లడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. నౌకలు ముందుకు సాగుతుండగా ఇరాన్ గన్‌బోట్ల నుండి కాల్పులు జరిగినట్లు ‘యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్’ (UKMTO) ధృవీకరించింది.

భారతీయ నౌకలే లక్ష్యం:
అనాడోలు ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఇరాన్ యొక్క ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) లక్ష్యంగా చేసుకున్న రెండు నౌకలు భారత్‌కు చెందినవి. ఇందులో ఒక నౌక 20 లక్షల బారెల్స్ ఇరాకీ చమురును మోసుకెళ్తోంది. అదృష్టవశాత్తూ నౌక మరియు అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారని సమాచారం. అయితే, ఈ ప్రాంతంలో మోహరించిన అమెరికా నావికాదళానికి ఈ దాడి గురించి కనీసం సమాచారం కూడా అందకపోవడం గమనార్హం.

హోర్ముజ్ మార్గాన్ని ఇరాన్ ఎందుకు మూసివేసింది?
అమెరికా తన ఓడరేవుల వద్ద దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ, ‘సముద్రపు దొంగతనం’ వంటి చర్యలకు పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. దీనికి నిరసనగానే హోర్ముజ్ మార్గంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా సైనిక నౌకలు హోర్ముజ్ నుండి తప్పుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

20కి పైగా నౌకలు వెనక్కి:
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, హోర్ముజ్ మూసివేత వల్ల 20 నౌకలు తమ ప్రయాణాన్ని ఆపేసి ఒమన్ వైపు మళ్లాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ లెక్కల ప్రకారం, దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 23 నౌకలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ స్పందిస్తూ.. శత్రువులకు ‘చేదు ఓటమి’ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.


Posted

in

by

Tags: