నటి రేచల్ రెబెక్కా జీవితంలో తీరని గాయం.. ఏకపక్ష ప్రేమ ఉన్మాదంతో 16 కత్తిపోట్లు; పేగులు బయటకు వచ్చినా పోరాడి గెలిచిన వైనం!

సినిమాల్లో తనదైన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి రేచల్ రెబెక్కా, ఇటీవల ‘తాయ్‌కిళవి’ చిత్రంలో తన నటనతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. అయితే, ఆమె జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. కొన్ని ఏళ్ల క్రితం ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

మృత్యువుతో పోరాడిన క్షణాలు:
ఆ ఇంటర్వ్యూలో రేచల్ పంచుకున్న విషయాలు వింటే గుండె తరుక్కుపోతుంది. ఒక వ్యక్తి తనను ఏకపక్షంగా ప్రేమిస్తూ పెట్టిన చిత్రహింసల గురించి ఆమె ఇలా వివరించారు:

“అది 2008వ సంవత్సరం.. నేను కాలేజీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుండి నాకు డాక్టర్ అవ్వాలని కల. దాని కోసమే బాగా చదివేదాన్ని. అప్పుడే ఒకడు నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం మొదలుపెట్టాడు. నాకు అప్పట్లో ప్రేమపై ఆసక్తి లేదు, నా దృష్టి అంతా చదువుపైనే ఉండేది. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కాలింగ్ బెల్ మోగింది. నేను హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ తలుపు తీశాను. బయట అతడు ఉన్నాడు. వెంటనే నా చేతిలో ఉన్న ఫోన్‌ని లాక్కుని, ‘ఇది కావాలంటే నేను చెప్పిన చోటుకు రా’ అని చెప్పి పారిపోయాడు. ఆ ఫోన్ నాకు మా బాబాయ్ కొనిచ్చారు, అది నాకు చాలా ప్రత్యేకం. ఏం చేయాలో అర్థం కాక, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను.”

ఆత్మహత్య ఆలోచన నుండి వైరాగ్యం వైపు:
“మా ఇంట్లో నేను హెయిర్ ఆయిల్ లాంటివి తయారు చేసేదాన్ని. దాని కోసం ‘గురివింద గింజలు’ (కున్రిమణి) తెచ్చి పెట్టాను. అవి విషమని నాకు తెలుసు. వాటిని పొడి చేసి తిని చనిపోదామని నిర్ణయించుకున్నాను. కానీ తినే ముందు దేవుడికి దండం పెట్టుకుందామని వెళ్లి అద్దంలో నా మొఖం చూసుకున్నాను. అప్పుడు నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది – ‘నేనేం తప్పు చేశాను? ఎందుకు నేను చావాలి?’ అని. ఆ క్షణమే నా నిర్ణయం మార్చుకుని ఆ విషాన్ని పారేశాను.”

ఘోరమైన దాడి:
“నేను జరిగిన విషయాన్ని మా నాన్నకు చెప్పాను. ఆయన నాకు ధైర్యం చెప్పారు. కొద్దిసేపటికి నాన్న బయటకు వెళ్లారు, నేను మా అమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నాం. మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే మళ్ళీ అతనే వచ్చాడు. అమ్మ అతడిని తిట్టినా వినకుండా ఇంట్లోకి చొరబడ్డాడు. అతడి చేతిలో తుప్పు పట్టిన కత్తి ఉంది. దాంతో నన్ను, మా అమ్మను నరకడం మొదలుపెట్టాడు. నాకు శరీరంపై 16 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే అంతా అయిపోయింది.”

పేగులు బయటకు వచ్చినా..:
“ఒక పోటు నా కడుపులో బలంగా తగిలింది. నేను చేత్తో పట్టుకుని చూస్తే, లోపల పేగులు తెగిపోయి బయటకు వచ్చాయి. ఆ రోజు ఉదయం నేను తిన్న దోసె ముక్కలు కూడా బయట పడ్డాయి. అయినా నేను గట్టిగా కేకలు వేయడంతో వాడు భయపడి పారిపోయాడు. అమ్మ ఇరుగుపొరుగు వారిని పిలిచి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు నేను ఒకటే మాట చెబుతున్నాను – ‘నేను బ్రతకాలి.. నన్ను కాపాడండి’ అని. మొదట తీసుకెళ్లిన ఆసుపత్రిలో గాయం చాలా లోతుగా ఉందని చేతులెత్తేశారు. మరో హాస్పిటల్‌కు వెళ్లేసరికి రక్తం చాలా పోయింది. కానీ మా నాన్న గతంలో చేసిన సాయం వల్ల చాలా మంది వచ్చి నాకు రక్తం ఇచ్చారు. ఆ రక్తమే నన్ను బ్రతికించింది.”

విజయం:
“చాలా రోజుల తర్వాత కళ్ళు తెరిచాను. నేను బ్రతికి ఉండటమే ఒక అద్భుతం. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను – ‘నేను కేవలం బ్రతకడం కోసం కాదు, నా కోసం రక్తం ఇచ్చిన వారి నమ్మకాన్ని నిలబెట్టాలి. ఏదైనా సాధించాలి, పదిమందికి సాయం చేయాలి’ అని. అందుకే ఇప్పుడు నేను ఇంత దృఢంగా నిలబడగలిగాను.”

ప్రస్తుతం రేచల్ రెబెక్కా సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె గతాన్ని తెలుసుకున్న అభిమానులు ఆమెపై మరింత గౌరవాన్ని చూపిస్తున్నారు.


Posted

in

by

Tags: