చైనాలో విడాకుల కేసులు పెరగడంపై ఒక కొత్త అధ్యయనం జరిగింది. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం మరియు పెరుగుతున్న సామాజిక అంగీకారమే విడాకులు పెరగడానికి ప్రధాన కారణాలని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నగరాల్లో నివసించే ఆధునిక మహిళలు ఇప్పుడు సమాజం కోసం కాకుండా, ‘చెడిపోయిన బంధాల నుండి బయటపడటానికి’ విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రభుత్వం విడాకులను కష్టతరం చేయడానికి ‘కూలింగ్-ఆఫ్’ (Cooling-off) నిబంధనను అమలు చేసినప్పటికీ, విడాకుల కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ప్రకారం, మహిళలే ఎక్కువగా విడాకుల కోసం డిమాండ్ చేస్తున్నారు.
2025లో 27 లక్షల విడాకులు నమోదు గణాంకాల ప్రకారం, 2025లో పరస్పర అంగీకారంతో జరిగిన విడాకుల సంఖ్య గత ఐదేళ్లలో అత్యధికంగా ఉంది. ఈ ఏడాది మొత్తం 27 లక్షలకు పైగా విడాకులు నమోదయ్యాయి. ఇది 2021తో పోలిస్తే 28% ఎక్కువ. విడాకుల కేసుల్లో దాదాపు 70% మహిళలే దాఖలు చేస్తున్నారు. మరోవైపు, 1980 తర్వాత వివాహాల రేటులో చారిత్రాత్మక తగ్గుదల కనిపించింది. గత 44 ఏళ్లలో అత్యంత తక్కువ వివాహాలు జరిగాయి. ‘సింగిల్’గా ఉండటం ఇప్పుడు కొత్త స్టేటస్ సింబల్‌గా మారుతోంది.
ఆర్థిక మాంద్యం మరియు కుటుంబ నిర్మాణంలో మార్పులు ఈ ధోరణిని మరింత వేగవంతం చేశాయి. చైనా సమాజంలో ‘సాంప్రదాయ కుటుంబ నమూనా’ అంతమై, ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ వైపు అడుగులు పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మహిళలు తమ ఆత్మగౌరవం మరియు ప్రత్యేక గుర్తింపు కోసం విడాకులను ఒక సామాజిక హక్కుగా చూస్తున్నారు.
ప్రభుత్వం తెచ్చిన 30 రోజుల నిబంధన ఈ పరిస్థితిని అదుపు చేయడానికి చైనా ప్రభుత్వం 2021లో 30 రోజుల ‘కూలింగ్-ఆఫ్ పిరియడ్’ నిబంధనను తెచ్చింది. అంటే విడాకుల రిజిస్ట్రేషన్‌కు ముందు 30 రోజులు తప్పనిసరిగా ఆలోచించుకోవడానికి సమయం ఇస్తారు. దీనివల్ల మొదట్లో విడాకులు తగ్గినట్లు అనిపించినా, మళ్లీ పెరగడం మొదలైంది.
షాంఘైకి చెందిన ఫ్యామిలీ లా లాయర్ గూయి ఫాంగ్‌ఫాంగ్ మాట్లాడుతూ, “గతంలో మహిళలు గృహహింస, వివాహేతర సంబంధాలు లేదా జూదం వంటి కారణాలతో విడాకులు కోరేవారు. కానీ ఇప్పుడు మహిళలు ‘మా మధ్య విలువల పొంతన లేదు’ లేదా ‘వివాహ జీవితం నాణ్యంగా లేదు’ వంటి కారణాలను ధైర్యంగా చెబుతున్నారు” అని పేర్కొన్నారు.
