ఇస్లామాబాద్‌లో ఇరాన్‌తో రెండో దశ చర్చలు జరుగుతాయన్న ఆశల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో మాట్లాడటానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. చర్చల నుండి అమెరికానే వెనక్కి తగ్గుతోందన్న ఇరాన్ వాదనను ఆయన తోసిపుచ్చారు.
అవసరమైతే ఇరాన్ అగ్రనేతలతో వ్యక్తిగత సమావేశంలో పాల్గొనడానికి కూడా తాను సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు. ‘న్యూయార్క్ పోస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాము ఎటువంటి క్రీడలు (Games) ఆడటం లేదని చెప్పారు.
జేడీ వెన్స్ బయలుదేరారు.. లేదు లేదు! చర్చల పట్ల తమకు ఆసక్తి ఉందని చెబుతూ.. ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్‌తో పాటు స్టీవ్ విట్కాక్, జారెడ్ కుష్నర్ ఇప్పటికే ఇస్లామాబాద్‌కు బయలుదేరారని, వారు త్వరలోనే అక్కడ చేరుకుంటారని ట్రంప్ మొదట ప్రకటించారు. అయితే, ఆశ్చర్యకరంగా కొద్దిసేపటికే ఆయన తన మాట మార్చారు. జేడీ వెన్స్ ఇస్లామాబాద్‌కు బయలుదేరలేదని ఆయన స్పష్టం చేశారు. కానీ, ఇరాన్ ఎప్పుడు చర్చలకు సిద్ధమైనా తాము సిద్ధంగా ఉన్నామని మాత్రం పునరుద్ఘాటించారు.
అమెరికాను నమ్మలేం: ఇరాన్ మరోవైపు, అమెరికా వైఖరిపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అమెరికాపై తమకు నమ్మకం లేదని, వారు పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చల విషయంలో అమెరికాకు సీరియస్ నెస్ లేదని, తమ నిర్ణయాలను ఇతరులపై రుద్దాలని చూస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ విమర్శించారు. యుద్ధం ఎవరికీ ఇష్టం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియాన్ అన్నప్పటికీ, ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇరాన్లో 3 వేల మందికి పైగా మరణించారు.
చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన తదుపరి రౌండ్ చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ ఆదివారం బహిరంగంగానే నిరాకరించింది. వాషింగ్టన్ అసాధ్యమైన డిమాండ్లు చేస్తోందని, ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ వర్గాలు తెలిపాయి.
